ఆ స్టార్ డైరెక్టర్ కు కోపం రావాలని కోరుకున్న ప్రభాస్.. కార‌ణం ఇదే..!!

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి నిన్న (అక్టోబర్ 8) తన పుట్టినరోజు సందర్భంగా పలు యూట్యూబ్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలలో పాన్ ఇండియా ప్రభాస్ సినిమా కోసం కసితో పని చేసినట్లు తెలిపారు. నెగిటివ్ కామెంట్లు నాకు గురువులుగా మారాయని, నన్ను నేను మార్చుకోవడానికి విమర్శలు యూజ్ అయ్యాయని, కెరీర్ తొలినాళ్లలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని ప్రేమ కథచిత్రమ్ తెరకెక్కించానని వెల్లడించారు.

అయినప్పటికీ కొందరు మళ్ళీ అలానే విమర్శలు చేస్తుంటే కసితో భలే భలే మాగాడివోయ్ సినిమా తీశానని అన్నారు. నన్ను విమర్శించే కొద్దీ నేను స్ట్రాంగ్ అవుతానని ఆయన పేర్కొన్నారు. నాకు చేతకాదని చేయలేనని ఎవరన్నా చెబితే నాకు చాలా కోపం వస్తుందని డైరెక్టర్ తెలిపారు. నేను తీయలేనని ఎవరన్నా కామెంట్ చేస్తే కచ్చితంగా హిట్ కొడతానని.. నేను కసితో చేసిన సినిమా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందన్నారు.

ప్రభాస్ తో సినిమా ప్రకటించిన సమయంలో ట్రోల్స్ రావడంతో నాకు చాలా కోపం వచ్చిందని.. ప్రభాస్ కూడా తనను డార్లింగ్ నీకు కోపం రావాలి అన్నాడని మారుతి పేర్కొన్నారు. నేను చేయలేనని కొందరు సవాల్ విసిరారని ప్రభాస్ సినిమాతో హిట్‌ కొట్టి చూపిస్తానని దర్శకుడు మారుతి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మారుతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.