పవన్ కోసం మెగా ఫ్యామిలీ రెడీ…!

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీ నాయకులను కలుపుకొని బహిరంగ సమావేశాలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ పార్టీ ఎంత ద్రోహం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికార వైసీపీ గడప గడపకు అంటుంటే, టీడీపీ బాదుడే బాదుడు అంటోంది. ఇక జనసేన కూడా వారాహి యాత్ర నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికే తనదైన శైలిలో పవన్ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని రాజకీయ రణరంగంలో పవన్ పోరాడుతున్నారు.

2024 ఎన్నికల ప్రచారంలో బాబాయ్‌కి అండగా అబ్బాయి రాంచరణ్ పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నయ్య చిరంజీవితో సహా టోటల్ మెగా ఫ్యామిలీ మొత్తం జనసేనాధిపతికి తోడుగా నిలవడం ఖాయమంటున్నారు. నిజానికి గత ఎన్నికల వేళ కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే పవన్ మాత్రం వెన్నుదన్నుగా నిలుస్తానని ముందుకొచ్చిన అన్నయ్య నాగబాబును వారించారు. మేమంతా మీ వెంటే అంటూ మెగా హీరోలు ఎలుగెత్తి చాటినా పవన్ మాత్రం వారిని ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉంచారు. కట్ చేస్తే 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్‌కు ప్రచారంలో మెగా ఫ్యామిలీ తోడుగా నిలుస్తుందని ప్రచారం ఊపందుకుంది. మెగా ఫ్యాన్స్‌ తో పాటు జన సైనికులు సైతం ఇందుకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. టోటల్ మెగా కుటుంబాన్ని ఒకే వేదిక పై చూడాలని..పవన్‌కు అండగా నిలవాలని కోరుకుంటున్నారు.