మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ `లియో` ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. కమల్ హాసన్ కు `విక్రమ్` లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కాంబోలో రూపుదిద్దుకున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లరే లియో. ఇందులో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తే.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించాడు. అక్టోబర్ 19న తెలుగు, తమిళ్ తో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాంబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా బయటకు వచ్చిన లియో ట్రైలర్ కు అన్నీ భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోకి చేరుకున్నాయి. అయితే ఈ తరుణంలోనే లియోకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది. లియో స్టోరీని హాలీవుడ్ నుంచి లేపేశాంటూ ప్రచారం జరుగుతోంది. 2005న హాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ది హిస్టరీ ఆఫ్ వాయిలెన్స్’ స్టోరీ ఆధారంగానే లియోను తీశారని.. ట్రైలర్ రిలీజ్ తో దర్శకుడు అడ్డంగా దొరికేశాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఓ మామూలు వ్యక్తి అనుకోకుండా ఇద్దరు దొంగలను చంపేస్తాడు. ఆ తర్వాత చాలా మంది అతడిని గ్యాంగ్ స్టర్ అనుకుంటారు. అతన్ని అంతం చేయడానికి కొంత మంది మాఫియా ముఠా సభ్యులు వెంటపడతారు. వారి నుంచి తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు వేరే ప్రాంతానికి వెళ్తాడు. కానీ, ఎక్కడకు వెళ్లినా మాఫియా నుంచి తప్పించుకోలేదు. దాంతో అతను తిరగబడతాడు. తనను చంపాలని చూసే వారిని హతమార్చుతూ.. గ్యాంగ్ స్టార్ గా మారిపోతాడు. ఇదే ది హిస్టరీ ఆఫ్ వాయిలెన్స్ స్టోరీ. అయితే లియో టీజర్, ట్రైలర్ ను గమనిస్తే.. అచ్చం ఇదే కథతో సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు హాలీవుడ్ మూవీకి లియో కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారు.