బ్రెయిన్ స్ట్రోక్ రావ‌డానికి కార‌ణాలు ఇవే..

శరీరంలో ఏ భాగానికి రక్తం సరిగా సరఫరా కాకపోయినా సరే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. ఇలాంటి పరిస్థితి మెదడుకు రక్తప్రసరణ జరిగే భాగంలో ఏర్పడితే మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. దీన్నే వైద్య భాషలో బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బ్లడ్ సర్క్యులేషన్ లో అసమతూల్యతలకు రెండు కార‌ణాలు ఉన్నాయి. అందులో ఒకటి కొవ్వు చేరడం వల్ల రక్తనాళాల్లో పూడికలు రావడం. రెండోది రక్తనాళాలు బలహీనపడి చెట్ల‌డం. అలాగే శరీరంలో ఏ భాగానికైనా ఇది జరగవచ్చు. రక్తం గడ్డ కట్టడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్ట‌ర్స్‌ చెబుతున్నారు.

మెదడు, గుండెకు వచ్చే స్ట్రోక్‌లు ప్రాణాంతకమైనవట. కరోనా తర్వాత ప్రజల్లో కొత్తగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో ప్రధానమైన సమస్య థ్రంబోసిస్. చాలామందికి వారికి తెలియకుండానే రక్తం గడ్డకట్టే ప్రాబ్లం వస్తుంది. తద్వారా స్ట్రోక్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఒక నిర్దిష్ట వయసు తర్వాత స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతున్నాయి. అప్పట్లో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులోపు వారిలోనే ఈ సమస్య ఉండేది.

ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసు నుంచే వృద్ధుల వరకు ఎవరికైనా ఈ స్ట్రోక్‌ వస్తుంది. ఇటీవల చిన్న వయసు వారిలో ఈ సమస్యను వైద్యులు ఎక్కువగా గుర్తిస్తున్నారు. భారీ శరీరంతో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, వంశపారపర్యంగా పక్షవాతంలాంటి వ్యాధులు ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, మద్యపానం, ధూమపానం వ్యసనాలు ఉన్నవారికి రక్తం చిక్కబడడం.. రక్తనాళాలు ప్రస‌ర‌ణ‌ కోల్పోవడం వల్ల ఇలాంటి స్ట్రోక్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివారు కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్ లేకుండా చూసుకోవాలి. మద్యపానం, ధూమపానం అస‌లు చేయరాదు.