బాబు అరెస్ట్‌.. వైసీపీకి ప్లస్‌ ఆర్ మైనస్‌…?

చంద్రబాబు అక్రమ అరెస్టుపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురు కావడంతో వైసీపీలో మంట పెరిగింది. ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏపీలోని అన్ని పక్షాలతోపాటు.. జాతీయ నేతలు.. మీడియా కూడా చంద్రబాబు అరెస్టుపై విరుచుకుపడటంతో ఏం చేయాలో తోచని స్థితికి చేరుకుంది. దీంతో ఏకంగా సజ్జల వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచిన వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకవైపు న్యాయపరమైన పోరాటం చేస్తున్న టీడీపీ… మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా వెల్లువెత్తుతున్న సానుభూతిని పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం ప్రారంభించింది. చంద్రబాబు అరెస్ట్‌ను జాతీయ స్థాయిలోని పలువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకించి, ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ నిరంతర నిరసన కార్యక్రమాలకు దిగింది. సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అనేక మంది పోస్ట్‌లు పెడుతున్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన, జై భీమ్ భారత్ పార్టీతో పాటు అనేక మంది మద్దతుగా నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో పాటు ఇతర నేతలు చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలన్నీ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ పార్టీలోని కొంతమంది నేతలు కూడా చంద్రబాబు అరెస్ట్ తమకు రాజకీయంగా ఇబ్బందుల్లో పడేసిందని, ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర నిరసన వస్తోందని అధినాయకత్వానికి వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిజైన్ టెక్ సంస్థ ఎండీ కన్వేల్కర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ కూడా ఇప్పుడు వైసీపీని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ దబాయింపులకు మేము సమాధానం చెప్పాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే అధికార పార్టీ ఏ స్థాయిలో డిఫెన్స్‌లో పడిందో అర్దమవుతోంది.

మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టుపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రంలో తాము 40 స్కిల్‌ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో చేసిన ఖర్చులు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అఖిలపక్షంతో కలిసి వస్తే చూపిస్తామన్నారు. 40 కేంద్రాలతోపాటు.. 2.13 లక్షల మంది శిక్షణ పొందిన వారితో పాటు.. ఉద్యోగాలు పొందిన 74వేల మంది వివరాలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి చంద్రబాబు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వెల్కర్ రూ.371 కోట్లు ఎక్కడ ఖర్చుపెట్టారో ఆధారాలు బయటపెట్టారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉంటుందన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. జగన్ కంపెనీల్లోకి వేల కోట్ల నిధులు పారాయన్న సాక్ష్యం ఉందన్నారు.

చంద్రబాబు అరెస్టుపై కోర్టుల్లో టీడీపీ తరఫు న్యాయవాదులు చేస్తున్న వాదనలు.. ఇస్తున్న డాక్యుమెంట్లు మీడియాలో పెద్దఎత్తున ప్రసారం అవుతున్నాయి. అయితే ఈ కేసులో ఏమీ లేదని న్యాయవాదులు చెపుతున్నారు. దీంతో అధికార పార్టీకి చంద్రబాబు అరెస్టు మేలు కంటే కీడు ఎక్కువ చేసిందని.. ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే సజ్జల, సీఐడీ చీఫ్‌ సంజయ్ మీడియా ముందుకు వచ్చి… తాము చేసింది కరెక్టే అని చెప్పే ప్రయత్నంచేశారు.