ఆరు గ్యారెంటీలు..కాంగ్రెస్ ఆశలు ఇవే.!

ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కష్టపడుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజలని కోరుతున్నారు. తెలంగాణ పొరాడి సాధించారని కే‌సి‌ఆర్‌ని రెండుసార్లు ప్రజలు గెలిపించారు. కానీ తెలంగాణ ఇచ్చిన తమ పార్టీని ప్రజలు ఒక్కసారి ఆదరించాలని కోరుతున్నారు. అయితే రాజకీయంగా అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి పార్టీని ఢీకొట్టి అధికారం సొంతం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని.

కానీ ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవడం కోసం కాంగ్రెస్ శాయశక్తుల కృషి చేస్తుంది. ప్రజా మద్ధతు పొందడానికి రకరకాల వ్యూహాలతో వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. అటు జాతీయ నేతలు తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సెప్టెంబర్ 17న భారీ సభ నిర్వహించారు. ఈ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అలాగే ఎన్నికల హామీలని కూడా ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల హామీలు మాదిరిగానే..తెలంగాణలో హామీలు ఇచ్చారు.

 

అక్కడ కాంగ్రెస్ వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి. మరి తెలంగాణలో వర్కౌట్ అవుతాయా? అనేది చూడాలి. ఇప్పటికే ఆరు గ్యారెంటీలని ప్రకటించింది. ఇవి ప్రజలని ఆకట్టుకునేలా ఉన్నాయి.

1. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు రూ.2,500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత             ప్రయాణం.

2. రైతు భరోసా కింద రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరిపంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్.

3. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

4. గృహ నిర్మాణానికి రూ.5 లక్షల సాయం.

5. విద్యార్ధులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్,

6. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ భీమా. ఇలా ఆరు గ్యారెంటీలు ప్రకటించి..వాటిని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మరి ఇవి ప్రజలని ఏ మేర ఆకట్టుకుంటాయో చూడాలి.