కారుకు జమిలి టెన్షన్..ఏం జరగనుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? షెడ్యూల్ ప్రకారం చూస్తే నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదట వారంలో గాని జరగాలి. కానీ ఇప్పుడు పరిస్తితులు చూస్తుంటే..ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదని బి‌ఆర్‌ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. దీనికి కారణం కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల ఆలోచన చేయడమే. ఇప్పటికే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదంతో ముందుకెళుతూ బిల్లు పెట్టాలని చూస్తుంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదు. రాజ్యాంగ సవరణలు జరగాలి. దాదాపు ఇదే జరిగే పని కాదు. కానీ పాక్షికంగా జమిలి ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఎలాగో 2024 ఏప్రిల్ లేదా మే లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ డిసెంబర్ లో తెలంగాణతో సహ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలని ఏప్రిల్ లో నిర్వహించి పాక్షిక జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అలా పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తమకు బెనిఫిట్ అవుతుందని బి‌జే‌పి ఆలోచిస్తుంది. పైగా ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే..ఆ ఎన్నికల్లో ఓటమి పాలైతే..ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుంది. అలా కాకుండా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది.

అలాంటప్పుడు తెలంగాణ ఎన్నికలు ఇప్పుడే జరిగే అవకాశాలు లేవు. అలా జరగకపోతే తమకు నష్టమని బి‌ఆర్‌ఎస్ భావిస్తుంది. ఇప్పటికే కే‌సి‌ఆర్ అభ్యర్ధులని ప్రకటించేశారు. డిసెంబర్ లో ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఎన్నికలు జరిగితే బాగానే ఉంటుంది..లేదంటే బి‌ఆర్‌ఎస్‌కు నష్టమే అంటున్నారు.