ఎమ్మెల్యేలకు ఎర్త్‌ పెడుతున్న ఎమ్మెల్సీలు….!

బీఆర్ఎస్‌లో చాలా మంది ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎర్త్ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం రేసులోకి దూసుకొచ్చి ఎమ్మెల్యేలకు షాక్‌ ఇస్తున్నారు. ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులనే తమవైపు తిప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఉవ్విళ్లూరుతున్నారు బీఆర్ఎస్‌ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో సిట్టింగ్‌లకు చెక్‌ పెట్టి సీటు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. దీంతో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీగా పరిస్థితి మారిపోయింది.

ఒకటి రెండు కాదు మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. రేపో మాపో టికెట్లు అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఎమ్మెల్యేలకు పోటీగా ఎమ్మెల్సీలు టికెట్ కోసం స్పీడ్ పెంచారు. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అసమ్మతి సమావేశం పెట్టారు. పల్లాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అంతర్గతంగా మంత్రాంగం నడుపుతున్నారు. ఆయనకు కేటీఆర్ ఆశీస్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్సీల పోరుతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గ నేతలతో బల ప్రదర్శనకు దిగారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రగతి భవన్ పెద్దలకు దగ్గర వారే కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక తాండూర్‌లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మధ్య టికెట్ ఫైట్ పీక్ స్టేజీకి చేరింది. పైలట్‌ రోహిత్‌ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదంటున్నారు. అందుకే తనకే టికెట్ కావాలని ఎమ్మెల్సీ పట్నం పట్టు పడుతున్నారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతానని ఓపెన్ గానే సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని రాకపోయినా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఆయన పార్టీ మారితే ఆయన సతీమణి జెడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి కూడా పార్టీ వీడుతుంది. ఎన్నికల ముంగిట వారిని వదులుకుంటే నష్టపోతామని బీఆర్ఎస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య టికెట్ పోరు ముదిరి పాకాన పడింది. కడియంకు కేసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన వర్గీయులు ప్రచారం స్టార్ట్ చేశారు. దీంతో రాజయ్య వర్గంలో నైరాశ్యం పెరిగింది. మహబూబాబాద్ నియోజకవర్గంలో శంకర్ నాయక్‌కు టికెట్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ స్థానంలో మంత్రి సత్యవతి రాథోడ్ పేరు వినిపిస్తోంది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పావులు కదుపుతున్నారు. పోటీ సమావేశాలు పెడుతున్నారు. మెదక్‌లో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి రేసులోకి వచ్చారు. నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే భగత్‌కు ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఎర్త్ పెడుతున్నారు. పెద్దపల్లిలో మనోహర్ రెడ్డి స్థానంపై ఎమ్మెల్సీ భానుప్రసాద్ కన్నేశారు. అయితే టికెట్ ఎమ్మెల్సీలకు వస్తుందా ఎమ్మెల్యేలకు దక్కుతుందా చూడాలి మరి.