శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఫుల్ క్లారిటీ…!

రాబోయే ఎన్నికల్లో గెలుపే వైసీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే ఇప్పటికే పార్టీ నేతలకు వై నాట్ 175 అంటూ టార్గెట్ పెట్టారు. ఇదే సమయంలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో టాప్ ప్లేస్‌లో ఉన్నది శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం. వరుసగా రెండు సార్లు ఓడిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు జగన్. అందుకే ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై జగన్ దృష్టి సారించారు.

2014 ఎన్నికల్లో రెడ్డి శాంతి పోటీ చేయగా… 2019 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడారు. ఈ రెండు ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. 2014లో లక్షన్నర పైగా ఓట్ల తేడాతో గెలవగా… 2019లో మాత్రం ఈ మెజారిటీ భారీగా పడిపోయింది. అయితే దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు రామ్మోహన్ నాయుడు. ఇక ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో రామూ హ్యాట్రిక్ సాధించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధాన కారణం… నైసీపీ తరఫున పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేడనే మాట బలంగా వినిపిస్తోంది. దీంతో ఈ సారి ఎలాగైనా సరే సిక్కోలులో వైసీపీ జెండా ఎగరాలనే లక్ష్యంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా ఉన్న కాళింగులకు ఈ సారి టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ముగ్గురు సీనియర్ నేతలకు జగన్ అప్పగించారు. ధర్మాన సోదరులతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అభ్యర్థి ఎంపికపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సరైన పేరు, రామూకు ధీటైన వ్యక్తి తగలలేదు అనేది బహిరంగ రహస్యం. దీంతో కింజరాపు కుటుంబం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తమ్మినేని సీతారాంను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో ఓ పుకారు షికారు చేస్తుంది. స్పీకర్‌గా పని చేసిన వ్యక్తి… మళ్లీ అసెంబ్లీకి ఎన్నికైన సందర్భంలు లేవు. దీంతో ఈ సారి తమ్మినేనిని ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గానికి బదులుగా పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దింపితే బెటర్ అనే కోణంలో జగన్ ఆలోచిస్తున్నారు.

2009లో కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు ఎర్రన్నాయుడుపై కాళింగ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో 2024 ఎన్నికల్లో సైతం ఇదే ఫార్ములా అనుసరిస్తే… తప్పకుండా వర్కవుట్ అవుతుందనేది జగన్ భావన. అటు ఆమదాలవలస నియోజకవర్గంలో కూడా తమ్మినేనికి కావాల్సినంత ఎదురుగాలి వీస్తోంది. దీంతో తమ్మినేని కూడా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తే బెటర్ అనే కోణంలో తన వర్గం నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.