మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంతరం రామ్ చరణ్ సోలోగా చేస్తున్న సినిమా ఇది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తే.. ఎస్.జె.సూర్య, జయరామ్, నవీన్ చంద్ర, నాజర్, రాజీవ్ కనకాల తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఈ సినిమా ప్రారంభమైంది. ఈపాటికే గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉన్నా కూడా శంకర్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. గేమ్ ఛేంజర్ సెట్స్ మీద ఉన్నప్పుడే శంకర్.. మధ్యలో ఆగిపోయిన తన గత చిత్రం `ఇండియన్ 2`పై ఫోకస్ పెట్టారు. ఇండియన్ 2ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. దీంతో గేమ్ ఛేంజర్ కు బ్రేక్ పడింది.
లాంగ్ గ్యాప్ తర్వాత గత వారం మళ్లీ ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయింది. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ పై మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ రిలీజ్ పై ఎలాంటి స్పష్టత లేదు. నిర్మాత దిల్ రాజు కూడా కనీసం రిలీజ్ పై ఏమీ చెప్పలేకపోయారు. వచ్చే సమ్మర్ కు ఇండియన్ 2 రిలీజ్ కానుంది. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ విడుదల ఉంటుందని అనుకున్నారు. కానీ, ప్లాన్ మారింది. అనుకున్న దానికంటే ముందుగానే గేమ్ ఛేంజర్ రాబోతోంది. సమ్మర్ కానుకగా ఇండియన్ 2ను కాకుండా గేమ్ ఛేంజర్ ను విడుదల చేయబోతున్నారట. ఇండియన్ 2 ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా చాలా పెండింగ్ లో ఉందట. అందుకే ఇండియన్ 2 రిలీజ్ ను వాయిదా వేసి.. వేసవికి గేమ్ ఛేంజర్ ను తీసుకొచ్చే ప్లాన్ లో శంకర్ ఉన్నాడని టాక్.