సుప్రీం హీరో `మెగాస్టార్‌` ఎలా అయ్యాడు.. చిరంజీవికి ఆ బిరుదు ఎవ‌రిచ్చారో తెలుసా?

మెగాస్టార్ అంటే ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తుకువ‌చ్చే పేరు చిరంజీవి. అభిమానులే కాదు సినీ తార‌లు కూడా ఆయ‌న్ను మెగాస్టార్ అనే పిలుస్తారు. అంత‌లా ఆ బిరుదు చిరంజీవితో పెన‌వేసుకుని పోయింది. నిజానికి చిరంజీవి మొద‌ట్లో సుప్రీం హీరో అని పిలుచుకునేవారు. అయితే సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా అయ్యాడు.. అస‌లు చిరంజీవికి ఆ బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రు ఇచ్చారు..? వంటి విష‌యాలు చాలా మందికి తెలియ‌దు.

అయితే చిరంజీవికి మెగాస్టార్ బ‌రువు రావ‌డం వెన‌క ఓ క‌థ ఉంది. ప్ర‌ముఖ నిర్మాత‌ కేఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. వీరిద్ద‌రిదీ అప్ప‌ట్లో హిట్ కాంబినేష‌న్‌. కేఎస్ రామారావు నిర్మాణంతో చిరంజీవి చేసిన మొద‌టి సినిమా `అభిలాష‌` మంచి విజ‌యం సాధించింది. అప్ప‌ట్లో వంద రోజులు ఆడేసి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

ఆ త‌ర్వాత చిరంజీవి హీరోగా కేఎస్ రామారావు నిర్మాణంలో రాక్షసుడు, చాలెంజ్, మరణమృదంగం వంటి సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమాల ద్వారా చిరంజీవికి భారీ క్రేజ్ ద‌క్కింది. టాలీవుడ్ మొత్తం ఆయ‌న‌కు స‌లాం కొట్టింది. ఇక మ‌ర‌ణ‌మృదంగం విడుద‌ల స‌మ‌యంలోనే చిరంజీవిని కేఎస్ రామారావు సుప్రీం హీరో అని కాకుండా మెగాస్టార్ అని ప్ర‌జెంట్ చేశారు. మ‌ర‌ణమృదంగం టైటిల్ కార్డ్ లో మెగాస్టార్ చిరంజీవి అని వేయించారు. ఇక అప్ప‌టి నుంచి సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ అయిపోయాడు. కాగా, నేడు చిరంజీవి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెస్ వెల్లువెత్తున్నాయి. మ‌రోవైపు ఆయ‌న కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్స్ కూడా వ‌స్తున్నాయి.