విశాఖ రాజకీయం..బాబు-పవన్ టార్గెట్ క్లియర్ కట్.!

అతి త్వరలోనే జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ దసరాకు విశాఖలో కాపురం పెడతానని చెప్పుకొస్తున్నారు. ఇక జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టి..రాజధాని ఏర్పాట్లు ముమ్మరం అయితే..విశాఖలో వైసీపీకి రాజకీయంగా కలిసొస్తుంది. ఆ ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా పడుతుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజ్. ఈ నేపథ్యంలో వైసీపీని నిలువరించడానికి చంద్రబాబు, పవన్ గట్టిగానే కష్టపడుతున్నారు.

విశాఖ వేదికగా రాజకీయ వేడి రగులుస్తున్నారు. ఇప్పటికే పవన్ విశాఖలో వారాహి మూడో విడత యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అలాగే ఋషికొండపై అక్రమ కట్టడాలు కడుతున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖ ఎంపీ ఎం‌వి‌వి సత్యనారాయణ భూ కబ్జాలకు అంతు లేదని ఫైర్ అయ్యారు. తాజాగా అనకాపల్లిలో పర్యటించి..మంత్రి గుడివాడ అమర్నాథ్ పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా పవన్ క్లియర్ గా విశాఖలో వైసీపీ నేతలని టార్గెట్ చేస్తూనే సి‌ఎం జగన్ పై విరుచుకుపడుతున్నారు.

ఇదే సమయంలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు సైతం విశాఖపై ఫోకస్ పెట్టారు. ఆగష్టు 15 వేడుకలని విశాఖలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే విశాఖ బీచ్ రోడ్డులో 2 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి..విజన్ 2047 బుక్‌ని విడుదల చేయనున్నారు. పేరుకు ఈ వేడుకకు రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారు గాని. ఇది పక్కా టి‌డి‌పి కార్యక్రమంలాగానే కనిపిస్తోంది.

అటు పవన్, ఇటు బాబు విశాఖలో వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా రెండువైపులా వైసీపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.