రాజమండ్రికి బాబు-జగన్..వేడెక్కిన గోదావరి రాజకీయం.!

ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఏపీలో ప్రధాన పార్టీలు ప్రజలకు చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలు జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు జనంలో తిరుగుతున్నారు. అటు పవన్ మూడో విడత వారాహి యాత్ర మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పర్యటిస్తున్నారు. ఇప్పటికే సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాజెక్టులని పరిశీలించి..పలు బహిరంగ సభల్లో ప్రసంగించిన బాబు..తాజాగా ఏలూరుకు చేరుకున్నారు.

ఇక సోమవారం చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించనున్నారు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి..గోపాలపురం మీదుగా దేవరపల్లి చేరుకుని రోడ్‌ షో నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేస్తారు. అయితే జగన్ కూడా అదే పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలం(అల్లూరి సీతారామరాజు జిల్లా)లో పర్యటిస్తారు. వరద బాధితుల నివాసిత ప్రాంతాల్లో జగన్‌ పర్యటిస్తారు. సాయంత్రానికి ఆయన రాజమండ్రికి చేరుకుంటారు.

ఇక రాజమండ్రిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో జగన్, బీవీఆర్‌ ఫంక్షన్‌ హాలులో చంద్రబాబు బస చేస్తారు. ఇలా ఇద్దరు నేతలు ఒకే చోటుకు రావడంపై ఉత్కంఠ నెలకొంది. ఇరు పార్టీ శ్రేణులు భారీగా వస్తారు. దీంతో పోలీసులు ఈ పరిస్తితులని పూర్తిగా హ్యాండిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఇద్దరు నేతలు ఒకే చోటుకు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన సంఘటనకు పోలవరం, రాజమండ్రి వేదిక కానున్నాయి.