రేవంత్ లాజికల్ కౌంటర్స్..బీఆర్ఎస్‌కు చిక్కులు.!

తెలంగాణ రాజకీయాల్లో అధికార బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రమైంది. ఇదే క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మరింత ఊపులో ఉంది. వలసల జోరుతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ చెక్ పెట్టేస్తుందనే కోణంలో రాజకీయం వస్తుంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని చూస్తున్న బి‌ఆర్‌ఎస్ పార్టీకి..అమెరికా లో ఉచిత విద్యుత్ పై టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని పట్టుకుని..దానిపై నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు. కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం 8 గంటలు ఇస్తే చాలు అని చెప్పారని బి‌ఆర్‌ఎస్ రాజకీయం చేసింది. అయితే వాస్తవానికి రేవంత్ 24 గంటల కరెంట్ ఇవ్వమని చెప్పలేదు.

కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అని చెప్పి కనీసం 12 గంటలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని, మామూలుగా 3 ఎకరాల సన్నకారు రైతులు తెలంగాణలో ఎక్కువ కాబట్టి 3 గంటల్లో పొలాలకు నీళ్ళు వెళతాయని, అంతా రోజుకు దాదాపు 8 గంటలు సరిపోతాయని అన్నారు. కానీ దీన్ని బి‌ఆర్‌ఎస్ మాత్రం రేవంత్ 3 గంటలే కరెంట్ అంటున్నారని, కాంగ్రెస్ రైతుల ద్రోహుల పార్టీ అని కౌంటర్లు వేశారు.

పైగా గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అని అన్నారని, ఇప్పుడు ఛోటా చంద్రబాబు అయిన రేవంత్ 3 గంటల ఉచిత కరెంట్ చాలని అంటున్నారని ప్రచారం చేశారు. దీంతో బి‌ఆర్‌ఎస్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్లు ఓ రేంజ్ లో ఇచ్చారు. ఉచిత విద్యుత్తుతోనూ కేసీఆర్‌ దోచేశారని, ఎమ్మెల్యేలు, బి‌ఆర్‌ఎస్ నేతల భూములకే 10-12 గంటలు.. రైతుల భూములకు 8 గంటలే సరఫరా అని అన్నారు. పవర్‌ ప్లాంట్ల విషయంలోనూ అవినీతి జరిగిందని, ఇక గత టి‌డి‌పి ప్రభుత్వంలో బషీర్‌ బాగ్‌ కాల్పులకు కారణం కేసీఆరే అని, అప్పుడు ఉచిత కరెంట్‌ కుదరదని టీడీపీతో చెప్పించారు.. త్వరలో మోటార్లకు కేసీఆర్‌ మీటర్లు పెడతారని అన్నారు.

అసలు ఉచిత విద్యుత్తు పేటెంటే కాంగ్రెస్‌ది అని,  అధికారంలోకి వచ్చాక 24 గంటలూ సరఫరా ఉంటుందని హామీ ఇచ్చారు. తాను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్నారని, మరి కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చారు? అని, చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన మీరా తన గురించి మాట్లాడేదని ఫైర్ అయ్యారు. అలాగే 80 శాతం సిటింగ్‌లు ఇంటికే అని,  గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌కూ ఓటమి తప్పదని అన్నారు.