రేవంత్ అదిరే స్కెచ్..జనంలోకి కీలక హామీలు.!

ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటి సమస్య..తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. భారీగా నాయకులని కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఆ దిశగానే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పనిచేస్తున్నారు. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు.

అందుకే ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఆయన ప్రజలని ఆకట్టుకునేలా కీలక హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్  రేసులోకి వచ్చింది. బి‌ఆర్‌ఎస్ పార్టీతో ఢీ అనే పరిస్తితిలో ఉంది. ఈ క్రమంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలని కాంగ్రెస్ లో చేర్చుకుంటారు. అలాగే 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ చెప్పుకొచ్చారు. 80 స్థానాల్లో గెలిపించి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని రేవంత్ అంటున్నారు.

అలాగే ఓటర్లని ఆకట్టుకునేలా రేవంత్ ముందుకెళుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు ఫార్ములాని తెలంగాణలో ప్రయోగిస్తున్నారు. అక్కడ ఇచ్చిన హామీలని ఇక్కడ ఇస్తున్నారు. ఆడవాళ్ళకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, ఆరోగ్యశ్రీకి రూ.5 లక్షలు, రైతు రుణమాఫీకి రూ.2 లక్షలు, నిరుద్యోగ భృతి అందించుట.

ఇలా రేవంత్ కీలక హామీలు ఇచ్చారు. వాస్తవానికి ఈ హామీలు ప్రజలని బాగా ఆకట్టుకుంటాయనే చెప్పాలి. గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, ఇల్లు నిర్మాణానికి 5 లక్షల హామీ ప్రజల్లోకి బాగా వెళుతుంది. చూడాలి మరి ఈ హామీలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయో లేదో.