గత నాలుగేళ్ల నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో అనేక ట్విస్ట్‌లు వస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు వివేకా హత్య జరగగా, ఇది చేసింది చంద్రబాబు, టిడిపి నేతలే అని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వివేకా కేసులో నిజనిజాలు బయటపడుతున్నాయి. మొదట ఈ కేసులో చంద్రబాబుకు గాని, టిడిపి నేతలకు గాని సంబంధం లేదని, అప్పుడు వైసీపీ చేసిన కుట్ర అని, ఎన్నికల్లో లబ్ది పొందడానికే అలా చేశారని జనాలకు అర్ధమైంది.
సరే ఏదేమైనా గాని ఇప్పుడు వివేకా కేసులో ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ సోదరుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక అవినాష్ అరెస్ట్ అయితే వైసీపీకి నెగిటివ్ అవుతుందని, వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటు అవినాష్‌కు ఇవ్వడం కష్టమని ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే అవినాష్ బాబాయ్ మనవడు అభిషేక్ రెడ్డికి అవకాశం ఇస్తారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే అభిషేక్‌కు పులివెందులలో రెండు మండలాల బాధ్యతల అప్పగించినట్లు టాక్. ఇక నిదానంగా కడప ఎంపీ సీటుని ఆయనకే అప్పగిస్తారని అంటున్నారు. మొన్నటివరకు పులివెందుల బాధ్యతలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి చూసేవారని, వివేకా హత్య కేసులో ఆయన అరెస్టు తర్వాత అవినాశ్‌రెడ్డికి అప్పగించారని తెలిసింది.
ఇప్పుడు ఈయన్ను కూడా ఈ కేసులో సీబీఐ ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చన్న సమాచారంతో.. భాస్కర్‌రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనవడు డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డికి తొలుత రెండు మండలాలు అప్పగించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అవినాశ్‌రెడ్డి అరెస్టయితే అప్పుడు మొత్తం నియోజకవర్గం ఈయనకే అప్పజెబుతారని, అలాగే కడప ఎంపీ సీటులో ట్విస్ట్‌లు ఉండవచ్చని అంటున్నారు. మరి ఇవన్నీ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.