యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్.. అంతర్జాతీయ సినిమా వేదికపై చరిత్ర సృష్టించింది.
అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు లభించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో బుధవారం రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
`అవార్డు గోస్ టూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు` అని ప్రకటించగానే రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ లో సంతోషం ఉప్పొంగింది. ఒక్కసారిగా పైకి లేచి సంతోషంతో చప్పట్ల మోత మోగించారు. ఇక సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న మొదటి ఆసియా సాంగ్ గా `నాటు నాటు` రికార్డు సృష్టించింది. దీంతో యావత్ భారతీయులు తమ సంతోషాన్ని ట్విటర్ వేదికగా తెలుపుతున్నారు.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— RRR Movie (@RRRMovie) January 11, 2023