బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, ప్రముఖ నటి అతియా శెట్టి పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో గత కొన్నేళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న అతియా శెట్టి.. ఎట్టకేలకు జనవరి 23న అతడితో ఏడడుగులు వేసింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో రాహుల్, అతియా శెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మరియు పులువురు బాలీవుడ్ ప్రముఖుల నడుమ రాహుల్, అతియా ఒకటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించి ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు పెళ్లిలో అతియా శెట్టి ధరించి లెహంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆ లెహంగా తయారీకి ఎన్ని రోజులు కష్టపడ్డారో తెలిస్తే కళ్లు తేలేస్తారు. లైట్ పింక్ కలర్ లెహంగాలో అతియా శెట్టి అందంగా మెరిసిపోతూ కనిపించింది. అతియా శెట్టి ధరించిన లెహంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ లెహంగాను ప్రముఖ డిజైనర్ అనామిక రూపొందించారు. అయితే అతియా ధరించిన లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించామని తాజాగా అనామిక పేర్కొంది. అంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 416 రోజులు అతియా శెట్టి పెళ్లి లెహంగా కోసం శ్రమించారన్నమాట. ఈ విషయమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.