ఊరించి ఊరించి ఊసూరుమనిపించారు.. డార్లింగ్ ఫ్యాన్స్ ల‌బోదిబో!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో మూవీ సెట్ అయిందంటూ నిన్నంతా నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ఇటీవ‌ల‌ ప్రభాస్ ను కలిసి ఓ కథ వినిపించాడని.. అది ఆయనకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి.

వీరి కాంబో ప్రాజెక్ట్ ను అభిషేక్‌ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్‌ అగర్వాల్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడని టాక్ నడిచిం.ది అంతే కాదు `పుష్ప 2` అనంతరం ప్ర‌భాస్‌, సుకుమార్‌ సినిమా పట్టాలెక్కనుంద‌ని కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ, వారు ఊహించని అనౌన్స్మెంట్ వచ్చింది.

ప్రభాస్ – సుకుమార్ కాంబినేషన్ లో తాము ఒక సినిమా చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, ఇది కేవలం పుకారు మాత్రమే అని తాజాగా అభిషేక్‌ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. త‌మ‌ సంస్థ నుంచి ఏదైనా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని చేస్తే ఖచ్చితంగా తామే ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఉంటామని, పుకార్లను నమ్మొద్దని స‌ద‌రు సంస్థ పేర్కొంది. ఈ ఊహించ‌ని ప్ర‌క‌ట‌న‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ల‌బోదిబోమంటున్నారు. ఊరించి ఊరించి ఊసూరుమనిపించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.