ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. విశాఖలో ఆయన 10 వేల కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై సీఎం జగన్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేదని.. పెద్ద ఎత్తున విమ ర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో తెలుగును వద్దని.. ఇంగ్లీష్ ముద్దని చెప్పిన సీఎం జగన్.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న సభలో ఇంగ్లీష్‌లో కాకుండా.. తెలుగులో ప్రసంగించడం ఏంటనే విమర్శలు కూడా వచ్చాయి.
ప్రదానంగా ఏపీకి సంబంధించి విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అంశాలు, రాజధాని తదితర అంశాలపై జగన్ .. మోడీకి అర్థమయ్యే భాషలో కాకుండా.. కేవలం తెలుగులో మాత్రమే ప్రసంగించి తప్పించుకున్నారని పెద్ద ఎత్తున ప్రధాన మీడియాలోనే చర్చ నడిచింది. అయితే, దీనిపై వైసీపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. కానీ, దీనిపై అంతర్గతంగా మాత్రం వైసీపీలో చర్చ సాగిందని సమాచారం. ఈ ప్రసంగంపై కొందరు అధికార పార్టీ నాయకులు కూడా పెదవి విరిచినట్టు తెలుస్తోంది.
అయితే, దీనిపై పార్టీ అధిష్టానం మాత్రం ఇదే కరెక్ట్ అని చెప్పడం గమనార్హం. “ప్రధాని మోడీకి సభమీద అర్థం అయ్యేందుకు జగన్ ఇంగ్లీష్‌లో మాట్లాడి నా.. మోడీకి ఇంగ్లీష్ అర్ధం కాదు. సో.. ఆయన తెలుగులో మాట్లాడడం ద్వారా తెలుగు ప్రజలకు అర్ధం అవుతుంది. తర్వాత. . ఎలానూ.. సీఎం ప్రసంగాన్ని హిందీలోకి అనువదించి మోడీ కార్యాలయానికి పంపిస్తారు. సో.. ఇది కరెక్టే“ అని తాడేపల్లి వర్గాల్లోని కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అంటే.. సీఎం జగన్ తన ప్రసంగం తాలూకు హిందీ ట్రాన్సలేట్ కాపీని మోడీకి పంపిస్తారనేది స్పష్టమైంది.
అయితే, ఇప్పటికే దీనిపై రావాల్సిన విమర్శలు అయితే వచ్చేశాయి. జగన్ ఉద్దేశ పూర్వకంగా మోడీకి ఏమీ అర్ధం కాకూడదనే ఉద్దేశంతోనే మాట్లాడార ని.. ఇది ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని ప్రతిపక్షాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్ వ్యూహాత్మకంగా ఇటు తెలుగు వారికి అర్ధమయ్యేలా.. అటు మోడీకి తెలిసేలా.. వ్యవహరించారని అంటున్నారు.