దారుణంగా మారిన కీర్తి సురేష్ ప‌రిస్థితి.. హిట్ ప‌డినా లాభం లేదా..?

కీర్తి సురేష్.. ఈ ముద్దు గుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే హిట్ కొట్ట‌డ‌మే కాదు.. తన అందం, అభినయం ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది.

ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న ఈ బ్యూటీ `మహానటి` సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. అయితే `మహానటి` అనంతరం ఈమె కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగలేదు.. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బార్ల పడింది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ `సర్కారు వారి పాటతో` ప్రేక్షకులను పలకరించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది.

ఈ సినిమాతో వ‌రుస ఫ్లాప్ ల‌లో ఉన్న కీర్తి సురేష్ హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ దిశ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాచురల్ స్టార్ నానికి జోడిగా `దసరా` అనే సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `బోళాశంకర్` అనే మూవీ చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు మినహా కీర్తి చేతిలో మరో తెలుగు సినిమా లేదు. దీంతో కీర్తి పరిస్థితి దారుణంగా మారిందని.. `సర్కారు వారి పాట` వంటి హిట్టు పడినా లాభం లేకుండా పోయిందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారాన్ని కీర్తి సురేష్ నిజం చేస్తుందా? లేక మళ్లీ వరుస ఆఫర్లను అందుకుని కెరీర్ పరంగా జోరు చూపిస్తుందా అన్నది చూడాలి.