‘మైనింగ్’ పాలిటిక్స్: బాబుకు నో మైలేజ్!

అగ్గిపుల్ల…సబ్బుబిళ్ళ..కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు…ఇసుక నుంచి ఇళ్ల స్థలాల వరకు…టీడీపీ ప్రతి దానిలోనూ రాజకీయం చేయడంలో ముందుందని చెప్పొచ్చు. కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు చంద్రబాబు…ప్రతిదానిపై రాజకీయం చేయడంలో తగ్గేదెలే అంటున్నారు…అసలు ప్రతి క్షణం జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేసి…తన మైలేజ్ పెంచేసుకోవాలని బాబు నానా తిప్పలు పడుతున్నారు.

అసలు జగన్ ప్రభుత్వం మంచి పనే చేయనట్లు బాబు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి అంశంపైన రాజకీయం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ…మైనింగ్ మాఫియాకు తెగబడుతుందని చెప్పి బాబు విమర్శల వర్షం కురిపించారు. పైగా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి…తవ్వేసిన కొండల ఫోటోలని పెట్టారు. ఇదంతా వైసీపీ చేస్తుందని ఆరోపించారు. ప్రకృతిని కాపాడే కొండలని పిండి చేసేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేశారు.

సరే విమర్శలు చేశారు…అలాగే తీవ్రమైన ఆరోపణలు చేశారు…ఆ ఆరోపణలకు తగ్గట్టు కొన్ని ఫోటోలని కూడా చూపించారు. ఇంతవరకు కథ అంతా బాగానే ఉంది…కానీ ఎప్పుడైతే వైసీపీ కౌంటర్ ఇచ్చిందో అప్పుడే బాబు రాజకీయం తేలిపోయింది. టీడీపీ హయాంలోనే గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారనే సంగతి తెలుసుకుంటే మంచిదని సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక ఇందులో విచిత్రం ఏంటంటే…గత టీడీపీ హయాంలో తవ్వేసిన కొండల ఫోటోలని బాబు చూపించడం.

తూర్పు గోదావరిలో తవ్విన ఓ కొండ ఫోటోని పెట్టి..ఇది కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిర్వాహకం అని విమర్శలు చేశారు. కానీ అది టీడీపీ హయాంలోనే తవ్విన కొండ అని, గతంలో ఉన్న ఫోటోలని సజ్జల బయటపెట్టారు. అంటే బాబు రాజకీయం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు…మైలేజ్ పెంచుకోవడం కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు…దీని వల్ల మైలేజ్ పెరగడం కాదు గాని…ఉన్నది పోయేలా ఉంది.