విజ‌య‌వాడ‌లో టీడీపీ, వైసీపీకి చెక్ పెడుతోన్న ఇద్ద‌రు జ‌న‌సేన నేత‌లు…!

విజ‌య‌వాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీల‌కు ఇప్పుడు పోటీగా జ‌న‌సేన తెర‌మీదికి వ‌స్తోంది. ఇక్క‌డ నుంచి యువ నాయ‌కులుగా .. ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తులు జ‌న‌సేన త‌ర‌ఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వ‌స్తున్నారు. దీంతో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ రాజ‌కీ యాల్లో ఇప్పుడు జన‌సేన కూడా చేర‌డం గ‌మ‌నార్హం. వారే.. పోతిన మ‌హేష్‌, సోడిశెట్టి రాధా. ఈ ఇద్ద‌రు కూడా.. ఇటీవ‌ల కాలంలో దూకుడుగా ఉంటున్నారు.

పార్టీ కార్య‌క్ర‌మాల‌కు యువ‌త‌ను పోగు చేయ‌డంతోపాటు.. పార్టీ త‌ర‌ఫున కూడా బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ‌పై.. పోతిన మ‌హేశ్ ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీచేసిన‌.. ఆయ‌న ఓడిపోయారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఉన్న రాజ‌కీయ లోటును తీర్చేలా.. ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. నేనున్నానంటూ. ముందుకు క‌దులుతున్నారు. ఇటీవ‌ల మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ నిర్వ‌హించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ఓ యువ‌కుడిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీంతో అత‌నిని పోలీసులు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆవెంట‌నే విష‌యం తెలిసిన‌.. పోతిన‌.. వెంట‌నే స్టేష‌న్ కు వెళ్లి ఆ యువ‌కుడిని విడిపించి తీసుకువ‌చ్చారు. దీంతో పోతిన ఇమేజ్ పెరిగిపోయింది. ఇక‌, ప్ర‌భుత్వంపైనా.. మాజీ మంత్రి వెల్లంప‌ల్లిపైనా.. ఆయ‌న నిత్యం కామెంట్లు చేస్తూ.. రాజ‌కీయంగా హ‌వా పెంచుకుంటున్నారు. మ‌రోవైపు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సోడిశెట్టి రాదా.. యువ నేత‌గా ఎదుగుతున్నారు. ఒక‌వైపు.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంటే.. ఇంటింటికీ.. జ‌న‌సేన పేరుతో రాధా ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు.

ఈ ప‌రిణామాల‌తో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టివ‌ర‌కు నేను-నువ్వు..మాత్ర‌మే అనుకున్న టీడీపీ-వైసీపీ నేత‌ల‌కు రాధా.. మూడో నేత‌గా క‌నిపిస్తున్నారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన రాధా యువ‌తను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నాలు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ముమ్మ‌రం అయితే.. జ‌న‌సేన‌ త‌ర‌ఫున ఈయ‌న‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎలా చూసుకున్నా.. ఆ రెండు పార్టీల‌కు.. ఇబ్బందిక‌ర ప‌రిణామ‌న‌నే వాద‌న వినిపిస్తోంది.