మార్పులు ఖాయం… బాబు మారాలా? వారు మార‌తారా!

ఔను! ఎన్నాళ్ల‌ని ఎదురు చూస్తారు? ఎన్నేళ్ల‌ని బుజ్జ‌గిస్తారు? అయ్యా రండి..పార్టీని బాగుచేసుకుందాం.. మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి తెచ్చుకునేలా వ్య‌వ‌హ‌రిద్దాం.. అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబు తున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. సీనియ‌ర్ నేత‌లు.. గ‌తంలో మంత్రులు గా ప‌నిచేసిన వారు.. కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. తాజాగా జ‌రిగిన మ‌హానాడుకు గంటా శ్రీనివాస‌రావు, జేసీ బ్ర‌ద‌ర్స్‌, పొంగూరు నారాయ‌ణ‌, రాయ‌పాటి కుటుంబం, మాగంటి ఫ్యామిలీ.. ఇలా.. చాలా మంది సీనియ‌ర్లు దూరంగా ఉన్నారు.

మ‌రి వారు వెళ్లాల‌ని లేక‌.. దూరంగా ఉన్నారా? లేక‌.. మ‌న‌సులో ఏదైనా మార్పు కోరుకుంటున్నారా? అనేది ఇప్ప‌టికీ అంతు చిక్క‌ని విష‌యం. ఇలా.. చాలా మంది ఉన్నారు. పార్టీ అధికారంలో ఉంటే.. ప‌ద‌వులు వాడుకోవ‌డం.. అధికారం కోల్పోయాక‌.. మ‌ళ్లీ.. తెర‌చాటు అయిపోవ‌డం.. అల‌వాటుగా మారిపోయింది. పార్టీలో ఏం చేసినా.. చెల్లుతుంద‌నే ధోర‌ణి కూడా పెరిగిపోయింది. దీంతో ప‌నిచేసేవారు.. దిగులు పెట్టు కుంటున్నారు. “మేం ప‌నిచేస్తున్నాం.. రేపు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మాకు గుర్తింపు ఉంటుందా?“ అని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, ప‌నిచేయ‌ని వారు ఎలానూ క‌నిపించ‌డం లేదు. దీంతో ఇప్పుడు ప‌నిచేయ‌ని వారు ఎలానూ లేకుండా పోయారు కాబ‌ట్టి.. అంతో ఇంతో.. వ‌చ్చి పార్టీని నిల‌బెట్టుకోవాల‌నే సంక‌ల్పంతో ముందుకు సాగుతున్న వారిని కాపాడుకునేందుకు టీడీపీ శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రిగిన మ‌హానా డులో.. “ఇక తేల్చుకోండి.! మీరు మార‌తారా? మేం మారాలా?“ అంటూ.. చంద్ర‌బాబు సీనియ‌ర్ల‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లే చేశారు.

అంటే.. ఇక‌.. సీనియ‌ర్లుగా ఉంటూ.. పార్టీకి ఏమాత్రం ప‌నిచేయ‌ని వారిని ప‌క్క‌న పెట్టాల‌ని..చంద్ర‌బాబు దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చారు. తాజాగా జ‌రిగిన పార్టీకీల‌క నేత‌ల స‌మావేశంలోనూ.. దీనిపై చంద్ర‌బాబు చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. మ‌రో 2 నెల‌ల స‌మ‌యం ఇచ్చి.. వ‌చ్చే వారిని క‌లుపుకొని పోవాల‌ని.. లేక‌పోతే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా పోరాడుతున్న కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకుందామ‌ని.. ఒక తీర్మానానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఇప్ప‌టికైనా.. సీనియ‌ర్లు బ‌య‌ట‌కు వ‌స్తారో లేదో చూడాలి.