చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..

అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే అందులో ఆశ్చర్యం ఏముంది. పైగా ఇలాంటి ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి మెగాస్టార్ చిరంజీవి చెబుతున్న మాటలు కూడా.. కాస్త నర్మగర్భంగానే ఉన్నాయి.

‘తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాజ్యసభ సీటు ఆఫర్ అనేది పూర్తిగా అవాస్తవమని, అలాంటివేవీ తన వద్దకు రాను కూడా రావని’ మెగాస్టార్ ప్రకటించారు. కానీ ఆయన ముఖ్యమంత్రిని కలిసిన సమయం, సందర్భం, ఆ తరహా మాత్రం అనుమానాలను పెంచేదే.

ఈ ఏడాది ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ నాలుగు సీట్లు కూడా వైసీపీకే దక్కబోతున్నాయి. వాటిలో మూడుసీట్లకు కొత్తగా మనుషుల్ని వెతుక్కునే ప్రయత్నంలోనే పార్టీ ఉంది. ఆ పదవుల మీద ఆశలు ఎందరిలోనైనా ఉండవచ్చు గాక.. కానీ.. అనేక సమీకరణాల పరంగా.. పార్టీకి ఎక్కువ మేలు కాగల వ్యక్తులకే వాటిని కట్టబెట్టాలని జగన్ చూస్తే అది తప్పేం కాదు. అలాంటి క్రమంలో మెగాస్టార్ కు రాజ్యసభ సభ్యత్వం కట్టబెడితే గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఎడ్వాంటేజీ అవుతుంది.

సరిగ్గా.. ఎంపీ సీట్ల గురించి ఊహాగానాలు జరుగుతున్న సీజన్లో చిరంజీవి ‘ఒంటరిగా’ వెళ్లి జగన్ ను కలవడం వల్లనే ఇన్ని ఊహలు పడుతున్నాయి. ఎందుకంటే.. సినీ పరిశ్రమ ఇప్పుడున్న సంక్షోభ స్థితి గురించి వివరించడానికి, మంతనాలు సాగించడానికి చిరంజీవి వెళ్లారని ఏకపక్షంగా అనుకోవడానికి వీల్లేదు. ఆయన పరిశ్రమలో ఎవ్వరితోనూ ఇండస్ట్రీ స్థితిగతుల గురించి మాట్లాడి వివరాలు తెలుసుకుని అందరి అభిప్రాయాలు తెలుసుకుని వెళ్లి ఉంటే.. బాగుండేది. అలా చేసి ఉంటే.. ఆయన పరిశ్రమ బాగు కోసం, పరిశ్రమ సమస్యలను పరిష్కరించడం కోసం వాటిని నివేదించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లలేదు. అందుకోసమే వెళ్లినట్లు ఆయన చెప్పను కూడా లేదు. భోజనం చేసే క్రమంలో కొన్ని విషయాలు చర్చించారు అంతే.

తాను ఇండస్ట్రీ పెద్ద కాదు అని చిరంజీవి పదేపదే చెప్పుకుంటున్నారు. నిజమే.. జగన్ తో చర్చల అనంతరం.. ఆయన ఏదైనా చెప్పినంత మాత్రాన ఇండస్ట్రీ మొత్తం ఆయన మాట ఆలకిస్తుందనే నమ్మకం కూడా లేదు. చిరంజీవి భేటీతో ఇండస్ట్రీ సమస్య తీరుతుందనే నమ్మకమూ ఎవ్వరికీ లేదు. అలాంటప్పుడు.. ఆయన కేవలం ఇండస్ట్రీ సంగతులు మాట్లాడి వచ్చారనుకోవడం భ్రమ. రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడానికి ఆయన జంకవచ్చు గాక.. కానీ.. జగన్ నుంచి ప్రతిపాదన కూడా రాలేదని అంటే.. ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా?