గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ తోటచంద్రయ్య హత్య అనేది కేవలం ఆత్మరక్షణ కోసం జరిగిన హత్యగా రంగుపులిమే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఈ హత్యకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన వివరాలు విన్న వారికి.. అలాంటి అనుమానం కలుగుతుంది.
తోట చంద్రయ్య హత్య నడివీధిలో చుట్టు పక్కల ప్రజలు అందరూ చూస్తూ ఉండగానే జరిగింది. బైకుపై వెళుతున్న చంద్రయ్యను నిందితులు అడ్డుకుని కింద పడేసి.. కదలకుండా, ప్రతిఘటించకుండా పట్టుకుని హత్య చేశారు. చంద్రయ్య కొడుకు ఇచ్చిన ఫిర్యాదును బట్టి కేసు నమోదు చేసిన పోలీసులు, వెల్దుర్తి ఎంపీపీ చింత శివరామయ్య మిగిలిన వారిని అరెస్టు చేశారు.
ఈ రెండు వర్గాల మధ్య చాలా కాలంగా తగాదాలు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. అందులో బహుశా కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేకపోవచ్చు. ఎందుకంటే.. పాత తగాదాలు లేకుండానే.. నడిరోడ్డుమీద ఉదయం 7 గంటల సమయంలో హత్యకు పాల్పడడం అనేది జరగని పని. అయితే ఎస్పీ చెబుతున్న ప్రకారం.. చింత శివరామయ్య.. తన మీద దాడి జరుగుతుందనే భయంతోనే తోట చంద్రయ్యను చంపేసినట్టుగా అర్థమవుతోంది.
ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఇతరులు కొందరు.. తోట చంద్రయ్య దాడి చేస్తాడని చింత శివరామయ్యను హెచ్చరించారుట. అసలే పాతకక్షలు ఉండడంతో.. చంద్రయ్య వచ్చి తన మీద దాడి చేసేలోగా.. తనే దాడి చేయాలని శివరామయ్య అనుకున్నాడుట. అందుకే ఈ హత్య జరిగిందట. ‘నా మీద దాడి చేస్తాడని అనుకున్నాను గనుక.. అలా మరొకరు చెప్పారు గనుక.. ఆ భయంలో.. నేను ముందే వాడిని చంపేశాను’ అని చెబితే ఆ మాటలు ఆత్మరక్షణ కింద చేసిన హత్యగా కోర్టు పరిగణిస్తుందో లేదో గానీ.. హత్యకు దారితీసిన కారణాలు అవే అని.. పోలీసు అధికారులు చెబుతుండడం విశేషం.
హత్యకేసులో నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో.. ఆత్మరక్షణ ముసుగులో మసిపూసి మారేడు కాయ చేయడానికి ఇప్పటినుంచే రంగం సిద్ధమవుతోందా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.