నెక్ట్స్ ఏంటి? పసుపా..కాషాయమా?

గత ఎన్నికల్లో జగన్‌ హవాలో విజయం..దీంతో ఎంపీగా ఢిల్లీలో రాజభోగాలు.. అనంతరం పార్టీ అధినేతతోనే విభేదాలు.. ఆ తరువాత కేసులు.. అరెస్టులు.. వైసీపీ రెబల్‌గా గుర్తింపు.. ఇదీ నర్సాపూర్‌ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గురించి క్లుప్తంగా. ఎంపీగా ఆయన పదవీ కాలం 2024తో ముగిసిపోతుంది. మరి ఆ తరువాత పరిస్థితేంటి? వైసీపీలో పార్టీ టికెట కచ్చితంగా ఇవ్వరు. ఇది రఘురాముడికే కాదు రాష్ట్రమంతా తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా.. అధినేతను అడ్డంగా మాట్లాడుతున్న రఘురామరాజు ఇతర పార్టీల వైపు చూస్తున్నాడని పరిశీలకులు భావిస్తున్నారు.

తను ఎంపీగా పోటీచేయాలని భావిస్తున్నాడు గానీ ఎలా? అనేది ఇపుడు ఆయనకు అర్థంకాని విషయంగా మారిపోయింది. రఘురామపై వైసీపీ నాయకులు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి ఆయనపై అనర్హత వేటు వేయాలని పలుసార్లు కోరారు కూడా. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ఎన్నికైన పార్టీనే విమర్శిస్తుండటంతో వైసీపీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ అండ చూసుకొని ఆయన విర్రవీగుతున్నాడని.. ఇలా ఎంతకాలం ఆయన ఆటలు సాగుతాయిలే అనే ధోరణిలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో ఈయన కమలం పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తున్నాడని.. అందుకే కషాయ బృందానికి అనుకూలంగా మాట్లాడుతూ బీజేపీ పెద్దలకు దగ్గరగా ఢిల్లీలోనే ఉంటూ రోజూ టచ్‌లోనే ఉంటున్నాడనే కామెంట్‌ పొలిటికల్‌ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది.

ఇదేకాక మరో మాట కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. రఘురామకు చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతిస్తున్నాడని.. జగన్‌ను వీలైనంత ఇబ్బంది పెట్టే కామెంట్స్‌ చేయాలని బాబే ప్రోత్సహిస్తున్నాడనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల ఆందోళనలో పాల్గొనడం, చంద్రబాబునాయుడు కౌగిలించుకోవడాన్ని గమనిస్తే టీడీపీలో కూడా చేరే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. తాను ఏపార్టీలో చేరినా జనసేన, టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన పక్షంలో గెలుపు తథ్యమనే ధీమాలో ఉన్నారని తెలుస్తోంది. అయితే.. ఏం జరుగుతుందనేది ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Share post:

Popular