తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది.
అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి తాడో..పేడో తేల్చుకు రావాలని ఆదేశించారు. అధినేత ఆదేశంతో ఢిల్లీ వెళ్లిన టీఆర్‌ఎస్ టీమ్ వారం రోజుల పాటు అక్కడే మకాం వేసింది. ఎట్టకేలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి తమ డిమాండ్‌ను ఆయన ముందుంచింది. అప్పుడు కూడా పీయూష్‌ది పాత సమాధానమే. ముందు మీరు పంపాల్సిన ధాన్యాన్ని పంపండి.. అని అంతే.. టీఆర్‌ఎస్ టీమ్‌కు షాక్. ఏం చెప్పాలో.. ఏం అడగాలో వారికి అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టంగానే ఉంది.. మీకే క్లారిటీలేదని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు తెలిసింది. కేంద్రం వీరి డిమాండ్లను ఆమోదించలేదు.. ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఇంకా 27 లక్షల టన్నుల వరిని పంపాలని కచ్చితంగా చెప్పినట్లు సమాచారం. దీంతో ఏమీ చేయలేక ఢిల్లీ నుంచి మంత్రుల బృందం హైదరాబాదుకు వచ్చేసింది.
ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం వీరిద్దరివీ కేంద్రం ఓ మాట చెబితే.. టీఆర్‌ఎస్ మరో మాట చెబుతోందని విమర్శిస్తున్నారు. వరికొనుగోలు సమస్యకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని ఘాటుగా పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికి రైతుల సమస్య పట్టడం లేదని, ఆ కుటుంబం నుంచి కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ కుమార్, హరీశ్‌రావులలో కనీసం ఒక్కరు కూడా ఢిల్లీకి వెళ్లలేదని కూడా విమర్శిస్తున్నారు.