వెంక‌టేష్ – మీనా న‌టించిన సుంద‌ర‌కాండ సినిమా వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

విక్టరీ వెంకటేష్ – దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్లో వెంకటేష్ చేసినవి తక్కువ సినిమాలే అయినా అందులో సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకానొక‌ టైంలో వెంకటేష్ వరుస సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నారు.

వెంకటేష్ బొబ్బిలి రాజా, చంటి వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫామ్‌లో ఉన్న సమయంలో సుందరకాండ సినిమా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ నటించడానికి ముందు విచిత్రం జరిగింది. అప్పటికే తమిళంలో భాగ్యరాజా హీరోగా నటించిన సుందరకాండ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా అనువాద కార్యక్రమాలు జరుగుతూ ఉండగా అనుకోకుండా హీరో వెంకటేష్ ఈ సినిమా చూశారు. ఆ కథ నచ్చడంతో దాన్ని తెలుగులో చేయాలని నిర్ణయించుకున్నారు. అప్ప‌టికే నిర్మాత సత్యనారాయణ తెలుగు డబ్బింగ్ పూర్తి చేసి బిజినెస్ కూడా పూర్తి చేశారు. వెంకటేష్ ఈ సినిమా చేస్తానని పట్టుబట్టడంతో నిర్మాత సత్యనారాయణ తాను అప్ప‌టికే బిజినెస్ చేసిన బ‌య్యర్లు అందరినీ కన్విన్స్ చేసి… వాళ్ళు ఇచ్చిన దానికి రెట్టింపు డబ్బు ఇచ్చి డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ఆపేశారు.

ఇంతలోనే మరో చిక్కు ఎదురైంది. భాగ్య‌రాజా దగ్గర సత్యనారాయణ కేవలం డబ్బింగ్ రైట్స్‌ మాత్రమే తీసుకున్నారు. అగ్రిమెంట్లో ఎక్కడ రీమేక్‌ అన్న పదం వాడలేదు. తనకు మరో రు. 50 లక్షలు ఎక్కువ ఇస్తే గాని రీమేక్ రైట్స్ ఇవ్వ‌ను అని పెండింగ్‌ పెట్టారు. దీంతో సత్యనారాయణ రు. 25 లక్షలు ఇచ్చి రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందే సత్యనారాయణకు రు. 45 లక్షల చేతి చమురు వదిలింది.

అయితే సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో కెవివి. స‌త్య‌నారాయ‌ణ‌కు ఇది పెద్ద ఇబ్బంది అనిపించ‌లేదు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న సుందరకాండలో మీనా, కొత్త నటి అపర్ణ కథానాయికలుగా నటించారు. అప్ప‌ట్లో ఈ సినిమా ఓ సెన్షేష‌న‌ల్ అయ్యింది.