తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి జగన్ కు సీఎం పీఠం అప్పగించిన చంద్రబాబు .. ఆ తరువాత రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాలను వైసీపీకి కోల్పోయాడు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీదే హవా అయింది. సరే.. వారు అధికారంలోఉన్నారు.. కాబట్టి వైసీపీదే పైచేయి అవుతుందని అనుకోవచ్చు. మరి టీడీపీ కంచుకోటలు వైసీపీ దెబ్బకు బద్దలవుతున్నాయంటే టీడీపీ పని అయిపోయిందా? లేక చంద్రబాబు పట్టించుకోవడం లేదా అనేది తెలుగు తమ్ముళ్లకే అర్థం కావడం లేదు. కుప్పం, పెనుకొండ స్థానాలు ఏపీలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలనే చెప్పవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్లదే హవా. కుప్పంలో చంద్రబాబు కుటుంబం, పెనుకొండలో పరిటాల రవీంద్ర కుటుంబాలదే రాజ్యం. అటువంటిది ఆ రాజ్యాలు ఇపుడు జగన్ పార్టీ వశమయ్యాయి. ఇంతబలమైన తమ స్థానాలు జగన్ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ఇక తమకేముంది.. చెప్పుకోవడానికి అంటూ బాబు తన సన్నిహితులను ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
కుప్పంలో…
కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులన్నాయి. ఎన్నికల్లో ఓటర్లు జగన్ వైపే మద్దతు పలికారు. 19 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా కేవలం ఆరు వార్డుల్లో మాత్రమే తెలుగు తమ్ముళ్లు గెలిచారు. దశాబ్దాల నుంచి కుప్పం అనేది చంద్రబాబు కంచుకోట. అటువంటి ప్రాంతంలో వైసీపీ గెలిచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థైర్యాన్ని దెబ్బతీయాలనేది ప్లాన్. అనుకున్న ప్లాన్ ను అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేశారు. చిత్తూరు రాజకీయాల్లో పెద్దిరెడ్డి అందెవేసిన చేయి. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకోవాలని బాగా తెలిసిన వ్యక్తి. అందుకే ప్రస్తుత రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకొని కుప్పంలో పాగా వేశాడు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పొందిన తరువాత లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బలం, అధికారంతో కుప్పం చేజిక్కించుకున్నారని ఆరోపించారు. ఈయన ట్విట్టర్ వేదికగా స్పందించడం కంటే రాజకీయంగా పార్టీ కార్యకర్తలకు నైతిక బలం ఇచ్చేలా ప్రవర్తిస్తే బాగుంటుందని పలువురు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులే అనుకుంటున్నారు.
పెనుకొండలో..
పెనుకొండ ఈ పేరు వింటేనే పరిటాల రవీంద్ర గుర్తుకు వస్తాడు. అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అక్కడ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. పెనుకొండలో రాజకీయం అంటే పసుపు పచ్చ రంగు జెండా.. అంతే అంతకుమించి ఇతర పార్టీల జెండాలు అక్కడ కనిపించవు. పరిటాల రవీంద్ర హత్య తరువాత కూడా అక్కడ టీడీపీదే రాజ్యం.. పరిటాల రవి భార్య సునీత భర్త అడుగు జాడల్లో నడుస్తూ టీడీపీకి ఉన్న పట్టును సడలనీయలేదు. చంద్రబాబు నాయుడు కూడా పరిటాల కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే.. కాలచక్రం గిర్రున తిరిగింది. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పెనుకొండ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. దశాబ్దాలుగా టీడీపీ జెండా కింద ఉన్న పెనుకొండ ఇపుడు వైసీపీ జెండాకిందకు వచ్చేసింది. వైసీపీ నాయకులు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శంకర నారాయణ తనదైన శైలిలో రాజకీయం నడిపాడు. దీంతో పెనుకొండ మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించింది. అక్కడ 25 వార్డులుండగా టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలిచింది. మిగతా సీట్లన్నీ వైసీపీకి సమర్పించుకుంది. చంద్రబాబు నాయుడు పెనుకొండను కాపాడుకోవాలని ఎన్ని ప్లానులు వేసినా అవి వర్కవుట్ కాలేదు. దాదాపు ఎమ్మెల్యే స్థాయి నాయకులను అక్కడకు పంపాడు. అయినా ప్రయోజనం లేదు.
ఇలా.. తమ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో కూడా పరాజయాలు మూటగట్టుకుంటే.. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలో అర్థంకాక చిన్న, పెద్ద నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం. ఈసారి ఎలాగైనా సీఎం సీటులో కూర్చొని రాజకీయాలకు శాశ్వత విరామం తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మరి ఆయన ఆశ నెరవేరుతుందో, లేదో చూడాలి.