సోమును తీసేస్తే తప్ప.. ఈ పాపానికి నిష్కృతి లేదు!

భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం అవతరించిన దైవదూతలాగా ఫీలైపోయి.. ఆవేశంలో ఆయన చెప్పిన మాటలు పార్టీని ఇవాళ ప్రజల ఎదుట దోషిగా నిలబెడుతున్నాయి.
తాను పదవిలోకి వచ్చిన నాటినుంచి సోము వీర్రాజు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది లేదు. క్రియాశీలంగా, నిర్మాణాత్మకంగా నికార్సయిన విమర్శలు చేసింది కూడా లేదు. ఏదో తిట్టానంటే తిట్టానన్నట్టుగా పైపైన మాటలతో రోజులు నెట్టుకొస్తున్నారు. తద్వారా… వైసీపీ ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారని.. వారి ద్వారా.. బినామీ పేర్లపై అనేకానేక రూపాల్లో లబ్ధి పొందుతున్నారనే విమర్శలను కూడా మూటగట్టుకున్నారు. వీటి పర్యవసానంగానే.. తిరుపతిలో అమిత్ షాతో జరిగిన పార్టీ నాయకుల కీలక సమావేశంలో.. ‘‘మన పార్టీలో వైసీపీ ఏజంట్లున్నారు’’ అని అమిత్ షా హూంకరించేంత వరకు వచ్చింది. అక్కడినుంచి సోము కాస్త అలర్ట్ అయ్యారు.
తాను వైసీపీ తొత్తుగా ఇప్పుడు పనిచేయడం లేదని నిరూపించడానికి ఆయన ప్రజాగ్రహ సభను వాడుకోవాలని అనుకున్నట్టుగా ఉంది. తాను ప్రభుత్వాన్ని ఎంతగా తిట్టానో ఢిల్లీ పెద్దలకు వినిపించాలి గనుక.. అక్కడినుంచి ప్రకాష్ జవదేకర్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రభుత్వం మీద ఎన్నిరకాలుగా విమర్శించాలో ఆయనకు ఓ చక్కటి స్క్రిప్టు కూడా ఇచ్చారు. జవదేకర్ చాలా మంచిగా స్క్రిప్టు ప్రకారం మాట్లాడి చేతులు దులుపుకున్నారు.
కానీ.. తన ప్రసంగం వచ్చేసరికి సోము వీర్రాజుకు పూనకం వచ్చేసింది. ముందూ వెనుకా తెలియలేదు. ఘాటుగా విరుచుకుపడిపోయారు. పరిస్థితి ఎలా తయారైందంటే.. ఆయన మాట్లాడిన మాటలన్నీ.. చీప్ లిక్కర్ ప్రస్తావన ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇవాళ దేశమంతా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చవగ్గా చీప్ లిక్కర్ ఇస్తాననే వాగ్దానం గురించే మాట్లాడుకుంటోంది. తద్వారా.. పార్టీ పరువును సాంతం మంటగలిపేశారు. ఇతర విషయాలు, విమర్శలు ఎవ్వరికీ కనిపించడం లేదు. ఆ నష్టాన్ని పూడ్చడానికి సోము.. మళ్లీ ఒక ప్రెస్ మీట్ పెట్టి.. పేదల పక్షపాతిని అని చెప్పుకుంటూ.. వారికి డబ్బు మిగలడం కోసమే రేటు తగ్గింపు ఆలోచన అన్నారు గానీ.. అది కూడా పరువు తీసే మాటే.
బీజేపీ మాత్రం.. ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. సాధారణంగా.. రాష్ట్ర అధ్యక్షులకు పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. సాధారణంగా ఒక్కొక్కరికి రెండేసి పర్యాయాలు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఇస్తుంటారు. కానీ ఇప్పుడు సోము వీర్రాజు చేసిన పనికి.. తక్షణం ఆయనను మారిస్తే తప్ప.. తమ పార్టీకి ఏపీలో పుట్టగతులు ఉండవని కమలనాథులు తలపోస్తున్నారట. ఈ గండం నుంచి సోము వీర్రాజు గట్టెక్కే అవకాశం కూడా లేదని .. 2022 జూన్ నెల వరకు ఆయన పదవీకాలం ఉంటుంది. ఆయనకు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ సెకండ్ చాన్స్ ఇవ్వడం ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. పరిస్థితి ఇంకా విషమించితే.. ఆయనకు అవమానంగా అనిపించినా సరే.. పదవీకాలం పూర్తికాకముందే తొలగించినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.