యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)`. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించగా.. కీరవాణి సంగీతం అందించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశంలో ఉన్న సినీ ప్రియులందరూ ఈగర్ గా ఆర్ఆర్ఆర్ కోసం వెయిట్ చేస్తుండగా.. అనేక వాయిదాల అనంరతం ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ చిత్రం అట్టహాసంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. ఈ సినిమా వంద కాదు, రెండు వందలు కాదు.. ఏకంగా 2,212 స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతోంది. కేవలం తెలుగులోనే 1000 పైగా స్క్రీన్స్‌లో ప్రదర్శితం కాబోతున్న ఆర్ఆర్ఆర్ ను.. హిందీలో 793 స్క్రీన్స్, తమిళంలో 291 స్క్రీన్స్, కన్నడలో 62 స్క్రీన్స్ మరియు మలయాళంలో 66 స్క్రీన్స్ లలో ప్రదర్శించనున్నారు.
దీంతో కరోనా సెకండ్ వేవ్ తర్వాత రికార్డు స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో ఈ చిత్రంలో రూపుదిద్దుకుంది. ఇందులో చరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ భీమ్‌గా కనిపించబోతున్నారు.