ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.
ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. డిసెంబర్ 17న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా ఒక్కోటి వదులుతూ వస్తున్న మేకర్స్ డిసెంబర్ 12న హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు.
ప్రస్తుతం అందుకు ఏర్పాట్లు అన్నీ చకచకా జరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు బన్నీ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్ చెప్పారు. పుష్ప పార్ట్ 2 ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదని.. వచ్చే ఏడాది వేసవిలో లేదా దసరాకు స్టార్ట్ అవ్వనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ చెందారు. అయితే ఆ వార్తలు కేవలం పుకార్లే అని మైత్రీ నిర్మాతలు తేల్చేశారు. పుష్ప నిర్మాతలు నవీన్ యెర్నేని – వై.రవిశంకర్ – సీఈఓ చెర్రీలు మీడియాతో మాట్లాడుతూ.. `అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కథ ఇది. బన్నీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. టీమ్ అంతా చాలా కష్టపడి చేశారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.` అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పుష్ప పార్ట్ 2 గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెకెండ్ పార్ట్‌ను స్టార్ట్ చేస్తామని చెప్పేశారు.