దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా.. ఇప్పటికే ప్రమోషన్లు ముమ్మరంగా చేపట్టారు. మొన్న ముంబాయిలో నిన్న, బెంగళూరులో కూడా ఈవెంట్స్ నిర్వహించారు. ఇవాళ హైదరాబాదులో రాజమౌళి -ఎన్టీఆర్ -చరణ్- అలియా భట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు అందరూ సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఒక పాత్రికేయుడు ఆర్ఆర్ఆర్ పోస్టర్ ను చూపి వయసులో అల్లూరి సీతారామరాజు పెద్ద కాబట్టి.. పోస్టర్ లో కొమరం భీమ్ పాత్రధారి అయిన ఎన్టీఆర్ కంటే ముందు చరణ్ ఫోటో పెట్టారా అని అడిగారు. దీనికి స్పందించిన రాజమౌళి అలాంటిది ఏమీ లేదని.. చెప్పారు. కానీ నిజజీవితంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కంటే ఈ ఏడాది పెద్దవాడని రాజమౌళి చెప్పాడు. దీంతో మైక్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు నా వయసు టాపిక్ తేవడంఅంత అవసరమా..అని రాజమౌళిని ప్రశ్నించాడు.
ఇప్పుడు నా వయసు గురించి కాదు మీడియా వారు అడిగింది..సినిమాలో అల్లూరి వయసు గురించి… మరి నా వయసు ప్రస్తావన తీసుకు రావడం ఎందుకు.. మీడియా మిత్రులూ..మీరైనా అలాంటి ప్రశ్నలు అడగడం.. భావ్యమా..అని ఎన్టీఆర్ అడిగారు.. అయితే ఇదంతా సరదాగా సాగడం గమనార్హం. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ బయోపిక్ సినిమాలా ఆర్ఆర్ఆర్ ఉండదని మొత్తం కల్పితమని ఈ సందర్భంగా రాజమౌళి ప్రకటించారు.