ఫస్ట్ ఎటు పోదాం సామీ?

ఆయనంటే రాజకీయ నాయకులకు ఓ నమ్మకం.. ఓ భరసా.. తమ పార్టీని అధికారంలోకి తెస్తాడనే ఆశ.. అలా చేశాడు కూడా.. కావాల్సినంత డబ్బులిస్తే తన మేధస్సు ఉపయోగించి ఎలాగైనా పవర్ తెప్పిస్తాడు అనేది అందరూ నమ్ముతున్నారు.. అలా జరుగుతోంది కూడా. ఆయనే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. అలాంటి వ్యక్తే ఇపుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. ఏ విషయంలో అంటే తెలుగు రాష్ట్రాల విషయంలో. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని మాటిచ్చాడు. అయితే ముందు ఎక్కడ సర్వే చేయాలనే దానిపై మీమాంశ కొనసాగుతోంది. ఏపీలో తన పథకాలు ఎలా అమలవుతున్నాయో సర్వే చేసి చెప్పాలని పీకేను జగన్ కోరారట. అయితే ఆయన ఇది చెప్పి 45 రోజులైనా పీకే ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదని తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరు, తిరిగి వారికే టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా, లేక అక్కడ వేరే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో సర్వే చేయాలని జగన్ చెప్పారని తెలిసింది.

అయితే ఇంతవరకు పీకే టీమ్ పని మొదలుపెట్టలేదు. జగన్ చెప్పిన సమయం మాత్రం మించిపోయింది. ఇదిలా ఉండగా పీకే టీమ్ కేసీఆర్ పార్టీకి కూడా పనిచేస్తున్నాడు. టీఆర్ఎస్ గ్రాఫ్ రాష్ట్రంలో పడిపోతోందనే అనుమానం ఎందుకే సారుకు వచ్చిందట. హుజూరాబాద్ ఎన్నికల అనంతరం ఈ భయం కేసీఆర్ కు ఎక్కువైందట. ఎన్ని పథకాలు ప్రారంభించినా ఎందుకిలా జరుగుతోందో కనుకోండి అని పీకే టీమ్ కు కేసీఆర్ చెప్పారని తెలిసింది. దీంతో పీకే ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని సమాచారం. ఏపీలో మొదలుపెట్టాలా.. లేక తెలంగాణలో షురూ చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నాడట. ఆయన సమయం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదని వైసీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారని తెలిసింది. ఎందుకంటే ఆ సమయంలో తమ గ్రాఫ్ పెంచుకోవచ్చని వారి అభిప్రాయం.