ప్ర‌భాస్ దాతృత్వం..ఏపీ వాసుల‌ కోసం భారీ విరాళం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల కురిసిన వర్షాలు, భారీ వరదల కారణంగా ప్ర‌జ‌లు అత‌లా కుత‌లం అయిపోయిన సంగ‌తి తెలిసిందే. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల్లో చిక్కుకుపోయి ఎంద‌రో ప్రజలు మరణించారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఏపీ వాసుల‌ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే చ‌ర్య‌లు చేప‌ట్టింది.

మ‌రోవైపు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రెటీలు కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రూ. కోట్టి ని సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించి దాతృత్వం చాటుకున్నాడు. దీంతో ప్ర‌భాస్ మంచి మ‌న‌సుపై నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిపిస్తున్నారు.

గతంలో కూడా ప్ర‌భాస్ భారీగానే విరాళాలు అందచేసాడు. హైదరాబాద్ వరదల సమయంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ. కోటి, కరోనా సమయంలో రూ. 4.5 కోట్లు విరాళంగా అందించాడు. కాగా, ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టించిన `రాధే శ్యామ్‌` చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న విడుద‌ల కానుంది.

అలాగే ప్ర‌భాస్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌` మ‌రియు నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్‌-కె` చిత్రాల‌ను చేస్తున్నాడు. ఇవ‌న్నీ పాన్ ఇండియా చిత్రాలే కాగా.. వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.