తరుణ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అంజలి` సినిమాతో చైల్ట్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తరుణ్.. ఆపై హీరోగా మారి అతి తక్కువ సమయంలోనే లవర్ బాయ్‌గా టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన తరుణ్.. క్రమక్రమంగా ఫేడౌట్ హీరోగా మారిపోయాడు. అయితే ఈయన నటించిన చిత్రాల్లో `నువ్వే కావాలి` సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు.
హీరోగా తరుణ్ చేసిన తొలి చిత్రమిది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో తరుణ్‌కి జోడీగా రిచా నటించింది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు, స్రవంతి రవికిషోర్ లు కలిసి నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించగా.. కోటి సంగీతం అందించాడు.
రూ.కోటి తో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టి నిర్మాతలకు కాసుల పంట పండించింది. 2000 అక్టోబరు 13 ఎలాంటి అంచానాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేయడమే కాదు.. 20 కోట్ల రూపాయలు వసూలు చేసి అందరి చేత ఔరా అనిపించింది.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. నువ్వే కావాలి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునలకు షాక్ తగిలేలా చేసింది. ఎందు కంటే, ఈ సినిమా విడులైన ఆ ఏడాదే నాగార్జున నటించిన `ఆజాద్`, మహేష్ నటించి `వంశీ`, వెంకీ నటించిన `జయం మనదేరా` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూడు చిత్రాలను తరుణ్ సినిమా బీట్ చేసి అత్యధిక వసూళ్లు రాబట్టింది. దీంతో ఆ ఏడాది నువ్వేకావాలి సినిమానే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.