రవీందర్ కు అడ్డు వచ్చిన బండి..

కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తిరగి సొంత గూటికి చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కినుకు వహించిన రవీందర్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్నికల్లో విజయం కోసం గట్టి ప్రయత్నమే చేశారు. ఈయన విజయానికి మాజీ టీఆర్ఎస్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో రవీందర్ ఓడిపోయారు. అయితే ఆ తరువాత రవీందర్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

ఈటల రవీందర్ కు పూర్తి మద్దతు నిస్తున్నా బీజేపీలో చేరడానికి టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ అడ్డుకున్నాడని తెలిసింది. రవీందర్ ను బీజేపీలో చేర్పించేందుకు ఈటల శతవిధాలా ప్రయత్నించాడని. . అయితే బండి అందుకు సహకరించలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో బీజేపీ నుంచి దారులు మూసుకుపోవడంతో రవీందర్ మళ్లీ కారు తలుపు తట్టాడు. ఈ నేపథ్యంలోనే గురువారం పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలిసిందే. ప్రస్తుతానికి అయ్యిందేదో అయిపోయింది.. రాజకీయాల్లో ఇటువంటివన్నీ మామూలే.. టీఆర్ఎస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుదని, చెప్పుడు మాటలు విని మోసపోవద్దని రవీందర్ కు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. రవీందర్ కూడా అందుకు సమ్మతించాడు. త్వరలోనే రవీందర్ తిరిగి కారు ఎక్కనున్నాడని తెలిసింది.

ఇదిలా ఉండగా రవీందర్ సింగ్ గతంలో ఏబీవీపలో పనిచేశాడు. ఆ తరువాత బీజేపీలో చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అయితే ఈటల రాజేందర్ కనీసం తనను సంప్రదించకుండా రవీందర్ కు మద్దతు ఇవ్వడం, ఆయనను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండటంతో ఈటలకు చెక్ పెట్టకపోతే రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే రవీందర్ కు బీజేపీ తలుపులు మూసివేసినట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే బీజేపీలో బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా సాగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.