`పుష్ప‌`రాజ్‌గా మారిన వార్న‌ర్‌..త‌గ్గేదే లే అంటున్న బ‌న్నీ!

ఆసీస్‌ బ్యాటర్‌, సన్‌రైజర్స్‌ మాజీ సారథి డేవిడ్‌ వార్నర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికి ప‌రిమితం అయిన వార్న‌ర్‌.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టిక్ టాక్ వీడియోల‌తో ఫుల్ ఫేమ‌స్ అయిపోయాడు. ముఖ్యంగా తెలుగు సినిమా సాంగ్స్‌కి, డైలాగ్స్‌కు డ‌బ్ చేస్తూ నెటిజ‌న్ల‌ను భ‌లేగా ఆక‌ట్టుకున్నాడు.

త‌ర్వాత క్రికెట్ మ్యాచుల‌తో బిజీ అయిపోయిన వార్న‌ర్ మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత త‌న ఫేస్ మార్ఫ్ క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శించి `పుష్ప‌`రాజ్‌గా మారిపోయాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది.

ఈ నేప‌థ్యంలోనే పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్‌.. ఇలా ఒక్కోటి చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల `యే బిడ్దా.. ఇది నా అడ్డా..` అనే మాస్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా.. తాజాగా ఈ సాంగ్‌లో బన్నీ ఫేస్‌ని తన ఫేస్‌తో మార్ఫ్ చేసిన‌ వార్నర్ అందుకు సంబంధించిన‌ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్ర‌స్తుతుం ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన బ‌న్నీ.. `వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే’ అంటూ కామెంట్ పెట్టారు. మ‌రోవైపు విరాట్ కోహ్లీ ‘నువ్వు ఓకే నా!’ అని కామెంట్‌ చేయగా… `కాస్త గొంతు పట్టేసినట్టుంది..` అని వార్నర్ సరదాగా సమాధానం ఇచ్చాడు. మ‌రి ఆల‌స్యమెందుకు మీరు వార్న‌ర్ వీడియోపై ఓ లుక్కేసేయండి.

https://www.instagram.com/tv/CXVv7sbJU1X/?utm_source=ig_web_copy_link