ఏపీలో ఎలా అయినా సరే అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రూపొందిస్తున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు నిర్వహించాలని కేడర్‌ను ఆదేశించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడైనా తిరిగి సీఎం సీటులో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. అధికార పగ్గాలు దక్కాలంటే కుల సమీకరణలు చాలా ముఖ్యం. పార్టీలు, నాయకులు కుల సమీకరణలో చాలా ముందుంటారు. పల్లెల్లో కుల పెద్దలను కలవడం సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో టీడీపీకి బీసీలు దూరమవుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు కాపు వర్గాన్ని సంత్రుప్తి పరచే నిర్ణయాలు తీసుకుంటూ వారికి దగ్గరవుతుండటం.. జగన్ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుండటంతో కుల సమీకరణలు మారుతున్నాయి.
చంద్రబాబు నాయుడు 2019లో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.టీడీపీ నాయకులు కూడా కొందరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. 2019లో ఓటమి అనంతరం బీసీలను దగ్గరకు చేర్చుకునే యత్నం చేసిన చంద్రబాబు ఇపుడు పూర్తిగా వారిని విస్మరించారు. మరోవైపు జగన్ పలు కార్పొరేషన్లకు బీసీలను చైర్మన్లుగా నియమించి వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో బీసీలకు పెద్దపీటే వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాపులు టీడీపీకి దగ్గరవుతుండటంతోపాటు బీసీలు దూరమవుతున్నారు. ఈ సమీకరణలు వచ్చే ఎన్నికల్లో గత ఫలితాలనే పునరావృతం చేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ విషయాలను పట్టించుకోవడం లేదని.. వైసీపీ దూసుకు వెళుతుంటే తమ పార్టీ మాత్రం పూర్తిగా వెనుకపడిందని సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు.