‘కారు’ తిరిగొచ్చింది..‘బండి’ బయలుదేరుతుంది

వరి కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో ఇంకా కొద్దిరోజుల పాటు కొనసాగనుంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ మీడియాలో నానుతున్నారు. ఎవరూ రైతుకు మేలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఓ వైపు వర్షం వచ్చి వరి ధాన్యం మొలకలెత్తుతోంది..మరోవైపు అన్నదాతలు వరిని కొనేవారు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరి సమస్యను తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అయితే.. అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. ఎవరినీ కలవక.. ఎవరూ దొరకక ఉత్త చేతులతో వచ్చేశారు.

సీఎం అలా వచ్చాడో.. లేదో బీజేపీ నాయకులు మేల్కొన్నారు. మీరు వెళ్లి వచ్చారు కదా.. ఇపుడు మేము బయలుదేరుతామని ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ రూపొందించుకున్నారు. త్వరలో టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డీకే అరుణ తదితరులు హస్తినకు వెళ్లి కేంద్ర మంత్రులతో సమాలోచనలు జరుపనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలోనే ఢిల్లీలో చక్రం తిప్పాలని బండి టీమ్ భావిస్తోంది. అందుకే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, పరుషోత్తం రూపాల, నరేంద్ర సింగ్ తోమర్ లను కలిసి ఇక్కడ నెలకొన్న సమస్యను, కేసీఆర్ నిర్లక్ష్యాన్ని వివరించి కచ్చితంగా రైతులకు మేలు చేసేలా హామీ పొందాలని భావిస్తున్నారు. బండి అండ్ టీమ్ కేంద్రం పెద్దలను కలిసిన తరువాత మోదీ ఏమైనా హామీ ఇస్తే అది ఇక్కడ రాజకీయంగా బీజేపీకి ప్లస్ అవుతుందనేది కమలం నేతల ఆశ. కేంద్రం కచ్చితంగా ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో తెలుసుకుంటాం.. రైతులకు అన్యాయం జరుగకుండా చూస్తాం అని బీజేపీ నాయకులు చెబుతున్నారు.