కమలం.. ఇక కుల సమీకరణలు..

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఊహించని విజయం.. అసెంబ్లీలో ఇప్పటికే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో పట్టు పెంచుకునే యత్నం.. అధికారంలోకి కాకపోయినా కనీసం 30..40 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని టీబీజేపీ నాయకులు ప్లాన్ రూపొందిస్తున్నారు. వారికి హై కమాండ్ కూడా ఫుల్ సపోర్టు ఉంది. బండి సంజయ్ దూసుకుపోతున్నాడు. దీంతో పొలిటికల్ లీటర్లు కులసమీకరణలపై ద్రుష్టి సారించారు. ముఖ్యంగా మున్నూరుకాపు, ముదిరాజ్, రెడ్డి, ఎస్టీల ఓట్లు రాబట్టుకునేందుకు, వారి మద్దతు కూడబెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా బండి సంజయ్ పార్టీని సమాయత్తం చేస్తున్నాడు. ఈ నాలుగు కులాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సగం ఓట్లు ఉన్నాయని బీజేపీ నాయకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. వీరి ఓట్లను ఎలాగైనా రాబట్టుకుంటే కమలం పార్టీకి తిరుగులేని విజయం కచ్చితంగా వచ్చి తీరుతుందని పేర్కొంటున్నారు.

కుల సమీకరణాలపై ముందునుంచే కన్నేసిన కమలం పెద్దలు ఆ దిశగా గత ఎన్నికల్లోనూ అనుకున్న ఫలితాలు సాధించారు. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లతోపాటు హుజూరాబాద్, దుబ్బాక గెలుచుకోవడం ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపుతోంది. బీసీ ఓట్లపై ముఖ్యంగా మున్నూరు కాపుల ఓట్లపై కమలం కన్ను పడింది. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ఆ కమ్యూనిటీకి చెందిన వారు కావడంతోపాటు వారికి ఉన్న 12 శాతం ఓట్ షేర్ పై ద్రుష్టి సారించారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల ముదిరాజ్ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ లను కమలం పార్టీకి దగ్గర చేయాలని నాయకులు భావిస్తున్నారు. అందుకే ఆయా కమ్యూనిటీల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులతో భేటీలు జరుపుతున్నారు. వారికి ఉన్న ఓటు బ్యాంకును ఆరా తీస్తున్నారు. ఏం కావాలంటే అవి ఇస్తామని చెబుతూ తమవైపు లాక్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలా అన్ని వర్గాలపై ద్రుష్టి సారించి 2023లో కమలం వికసించేలా చూడాలనేది బండి ప్లాన్. మరి ఈయన ఫలితాలు ఏమేరకు ఫలితాలనిస్తాయో చూడాలి.