బాబు ప్రాభవానికి గండికొట్టే ఎన్నికలివి!

కుప్పం మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రాభవానికి గండి పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. 25 వార్డులు ఉన్న కుప్పం మునిసిపాలిటీలో- 15 వార్డుల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందగలరా అనేది కూడా ప్రశ్నార్థకమే అవుతుంది!

తన సొంత ఊరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గం తనను తిరస్కరించిన తర్వాత.. చంద్రబాబు జిల్లాకు ఒక మూలగా ఉండే కుప్పంకు మారారు. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేయడం మొదలు అయిన తర్వాత- ప్రతిసారీ ఘనమైన మెజారిటీనే వచ్చింది! మొత్తం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటైన కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు నీరాజనాలు పలికింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన చేపట్టారు. ‘కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం అనేది చరిత్రలో ఎప్పటికీ సాధ్యం కాదు’ అనే స్థాయిలో ఆయన ప్రజాదరణ కనిపిస్తూ వచ్చింది!

అయితే ఇప్పుడు రోజులు మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కుప్పం నియోజకవర్గం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. చంద్రబాబు నాయుడు ప్రాభవాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి- శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతున్న కాలంనుంచి ఆయనతో ముఖాముఖి తలపడుతున్న- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గ పార్టీ రాజకీయాలను దత్తత తీసుకున్నారు. స్థానికంగా కొందరు తెలుగుదేశం నాయకులను కూడా పార్టీలో చేర్చుకున్నారు. క్రమంగా వైసీపీని బలోపేతం చేస్తూ వచ్చారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి తరచూ వచ్చేంత ఖాళీ కూడా లేకుండా బిజీగా గడపడం ఇంకొక ఎత్తు. స్థానికంగా ఆయన కొందరు నాయకుల మీద ఆధారపడ్డారు. వారందరూ కూడా చంద్రబాబు జమానా సాగిన కాలంలో విపరీతంగా ఆర్థిక లబ్ధి పొంది స్థిరపడ్డారు. అవినీతికి పాల్పడ్డారు. ఇలాంటి వ్యవహారాల వలన చంద్రబాబు నాయుడుకు కుప్పం లో చాలా చెడ్డ పేరు వచ్చింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంది..

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనే కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజారిటీ గణనీయంగా తగ్గింది. తెలుగుదేశం పార్టీకి అదే పెద్ద ప్రమాద సంకేతం కాగా, ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలు వారికి ఇంకా పెద్ద గండంగా మారాయి. కుప్పంలో నామినేషన్ల పర్వం నుంచి రగడ నడుస్తూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మునిసిపాలిటీ చేజిక్కించుకుంటామనే ధీమాతో అధికార పార్టీ ఉంది. భారీగా ధనప్రవాహం సాగుతోంది. ఓటుకు పదివేల వరకు ధర పలికే అవకాశం కనిపిస్తోంది.

సోమవారం పోలింగ్ జరగనుండగా ఈలోగా చంద్రబాబు నాయుడు సరి కొత్తగా ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారో తన పరువును, ప్రాభవాన్ని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి!