మెగా, అల్లు బంధానికి బీటలు.. మెగా ట్యాగ్ నుంచి బయటపడేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారా..!

కొంతకాలం కిందటి వరకూ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒకటిగానే ఉండేది. చిరంజీవి నిర్ణయం ఏదైనా అల్లు అరవింద్,అల్లు అర్జున్ సహా అందరూ ఆయన వెంట నడిచే వారు. అల్లు అరవింద్ చిరంజీవి బావమరిది అయినా అంతకుమించిన స్నేహబంధం వాళ్ళిద్దరి మధ్య ఉందని చెబుతారు. అల్లు కుటుంబం నుంచి పరిచయమై స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ను చిరంజీవి అభిమానులు మొదటి నుంచి మెగా హీరోగానే భావించారు. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమా విడుదల సమయంలో చిరంజీవి ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో అందరికీ తెలిసిందే.

అల్లు అర్జున్ తొలి సినిమాకే చిరంజీవి ఫ్యాన్స్ పెద్దపెద్ద కటౌట్లు, బ్యానర్లు పెట్టి దండలు వేశారు. మెగాస్టార్ చిరంజీవి సపోర్టు లేకపోయి ఉంటే అల్లు అర్జున్ నటించిన తొలి సినిమాకే ఇంత ఆదరణ ఉండేది కాదు. బన్నీ హీరోగా పరిచయం అయినప్పటి నుంచి అతడు స్టార్ గా ఎదగడంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందించిన ఆదరణ మరువలేనిది. అల్లు అర్జున్ ను కూడా ఫ్యాన్స్ మెగా హీరోగానే అభిమానించేవారు.

జులాయి ఫంక్షన్ లో ఒకలా.. సరైనోడు ఫంక్షన్ లో మరోలా

జులాయి సినిమా ఆడియో విడుదల ఫంక్షన్ కు అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరు కాగా ఆయన సమక్షంలోనే మాట్లాడిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను హుషారెత్తించేలా ఈలలు, కేకలు వేయాలంటూ ఎంకరేజ్ చేశాడు. ఎక్కడైతే ఈ హంగామా ఉంటుందో అక్కడ పవన్ కళ్యాణ్ వుంటాడని పొగడ్తల వర్షం కురిపించాడు.

ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్లిన అల్లు అర్జున్ సరైనోడు భారీ విజయం తర్వాత తన మాట తీరులో మార్పు వచ్చింది. సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని ఆయన ఫ్యాన్స్ కేకలు పెట్టగా..’చెప్పను బ్రదర్’ అంటూ రిప్లై ఇచ్చాడు. సినిమా ఫంక్షన్లలో ఏంటి ‘మీ గోల’ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు క్లాస్ తీసుకున్నాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ అభిమానుల్లో చీలిక వచ్చింది.

చిరంజీవితోనూ దూరంగా బన్నీ

ఆ తర్వాత బన్నీ తాను ఎంతో సన్నిహితంగా మెలిగే చిరంజీవికి కూడా క్రమంగా దూరమవుతూ వచ్చాడు. ఈ ఏడాది ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే జరుగగా ఆ ఫంక్షన్ కు అల్లు ఫ్యామిలీ తప్ప మిగతా అందరూ హాజరయ్యారు. కనీసం బన్నీ, శిరీష్ ట్విట్టర్ ద్వారా చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పడంలోనూ ఆలస్యం చేశారు.

మా ఎన్నికలకు మరింత దూరంగా

ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా చిరంజీవి మద్దతు తెలిపిన ప్రకాష్ రాజ్ కు అల్లు ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వలేదు. అల్లుఅర్జున్ కనీసం ఓటు వేయడానికి కూడా రాలేదు. నాగబాబు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ తో ఫైట్ చేస్తుండగా అల్లు అర్జున్ కనీసం స్పందించలేదు.

చిరుకు దూరంగా అల్లు అరవింద్

ఒక బన్నీనే కాదు అల్లు అరవింద్ కూడా చిరంజీవి దూరం అవుతున్నట్లు అనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి అల్లుఅరవింద్ ఒక కారణమని అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. అంత ప్రచారం జరిగినప్పటికీ చిరంజీవి అల్లు అరవింద్ కు దూరం కాలేదు. సినీ ఇండస్ట్రీలో మొదటి నుంచి చిరంజీవి, బాలకృష్ణ ల మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే.

పైకి మేమంతా ఒక్కటే అని వాళ్ళు చెబుతున్నా చిరంజీవి, బాలకృష్ణ ఉప్పు, నిప్పులా ఉంటారని అందరికీ తెలుసు. ఇటీవల మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు పోటీ చేయగా బాలకృష్ణ విష్ణుకు మద్దతు తెలిపాడు. మా అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మోహన్ బాబు, విష్ణు చిరంజీవిపై విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లుఅరవింద్ బాలకృష్ణ, మోహన్ బాబు ఫ్యామిలీ కి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుండటం మెగాఫ్యాన్స్ కు నచ్చడం లేదు.

బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రోగ్రామ్

అల్లు అరవింద్ తన ఓటీటీ యాప్ అయిన ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో తొలి అతిథిగా మోహన్ బాబు వస్తున్నట్లు సమాచారం.

మా ఎన్నికల్లో చిరంజీవి మద్దతుతో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమి కోసం పనిచేసిన బాలకృష్ణ, మోహన్ బాబుతో అల్లు అర్జున్ సఖ్యతగా మెలగడం మెగా అభిమానులకు రుచించడం లేదు. ‘అన్ స్టాపబుల్’ ప్రోమో విడుదల సమయంలో కూడా అల్లు అరవింద్ బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించాడు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ తీరు చూస్తుంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నుంచి దూరం అయ్యేందుకు ప్రయత్నిస్తోందా.. అన్న సందేహాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. అభిమానులు మాత్రం ఆ రెండు కుటుంబాలు ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాయి.