మెగాస్టార్ వెనకడుగు.. ఆ ప్రయోజనం పొందేందుకేనా..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమా మే 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత థియేటర్లు తెరుచుకోకపోవడంతో వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. మళ్లీ ఇటీవల క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి.

అయితే అనూహ్యంగా ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాను అంతా ఆలస్యంగా విడుదల చేయడానికి మరో కారణం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా కేటగిరిలో నిర్మితమైన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ సినిమా విడుదల అయితే రామ్ చరణ్ కి పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆచార్య సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో చరణ్ కూడా నటిస్తుండటం వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత విడుదల చేస్తే బాలీవుడ్లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ విడుదలైన సుమారు నెల తర్వాత ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.