ఆదిమూలాలు ఇక కదులుతాయి?

October 9, 2021 at 6:08 pm

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు రాబోయే రోజుల్లే టెన్షనే.. మీడియా ముందుకు వచ్చి తనకు నచ్చని నాయకులను ఏకిపారేసే మంత్రి సురేష్ ఇపుడు ప్రతిపక్ష నేతల నోళ్లకు చిక్కాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మంత్రి దంపతులకు ఇబ్బందిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి, ఆయన భార్య విజయలక్ష్మిపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కేసు నమోదైంది. దీనికి సంబంధించి సీబీఐ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే.. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని సురేష్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.

అయితే.. పట్టువీడని సీబీఐ సుప్రీం తలుపులు తట్టింది. ఈ మేరకు కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. విచారణ కొనసాగించాలని సీబీఐకు సూచించింది. ఆదిమూలపు సురేష్ తరపు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. సుప్రీంతీర్పుతో ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ నాయకులను విమర్శించేందుకు ఆదిమూలపు రూపంలో మంచి అంశం దొరికిందనే చెప్పవచ్చు. ఇప్పటికే చంద్రబాబు జగన్ పై విమర్శలు జోరుగా చేస్తున్నాడు. అసలే జగన్ పై అక్రమ ఆస్తుల కేసులున్నాయి. ఇపుడు ఆదిమూలపు కూడా అదే కేసులో ఉన్నాడు. వైసీపీ నేతలకు మాత్రమే ఆస్తులు ఎలా పెరుగుతాయని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.

ఆదిమూలాలు ఇక కదులుతాయి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts