కాంగ్రెస్, పీకేల మధ్య ఎక్కడో తేడా కొట్టింది?

ప్రశాంత్ కిశోర్.. అధికారం రాదేమోననే సందేహంలో ఉన్న రాజకీయ పార్టీలను, ప్రచారం కోరుకునే రాజకీయ నాయకులకు పెద్ద దిక్కు లాంటి వాడు. మొన్న బీజేపీ, నిన్న వైసీపీతో పాటు పలు పార్టీలను అధికార స్థానంలో కూర్చోబెట్టిన పొలిటికల్ అనలైజర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ప్లాన్ వేశాడు. పలుసార్లు పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా సమావేశమయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చేరతాడనే ఊహాగానాలు కొద్ది నెలలుగా వచ్చాయి.

అయితే ఇపుడు ఏమైందో.. ఏమో కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు. పీకే కామెంట్ పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అరె.. మొన్నటి వరకు సోనియా కుటుంబంతో క్లోజ్ గా ఉన్న పీకే సడన్ గా ఇలా మారిపోయాడేంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరిలో రైతులు చనిపోయిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసనపై ఆయన తన అసహనం వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని ఆశించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డాడు.

అంటే… ఆయన కాంగ్రెస్ పార్టీని నేరుగా విమర్శించినట్టే. యూపీలోని రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని హౌస్ అరెస్టు చేయడంతోపాటు రాహుల్ గాంధీని అడ్డుకుంది. దీంతో ప్రియాంక తనను బంధించిన గదిని శుభ్రం చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేయడంతో యూపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పీకేకు ఏమైందో.. ఏమో.. ఇలా స్పందించాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పీకేకు పెద్దపీట వేయాలని భావించినా అందులోని సీనియర్లు ఈయనకు అడ్డు తగులుతున్నట్లు తెలిసింది. అందుకే ఇలా ఫీలైనట్లు సమాచారం. మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సహాయసహకారాలు అందిస్తాడో, లేదో కాలమే చెప్పాలి.