లోకేష్ ను పాపులర్ లీడర్ చేస్తున్న జగన్

చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమేమో అన్నట్లుంది ఏపీలో రాజకీయ పరిస్థితులు.. అదేంటి లోకేష్ ను రాజకీయంగా జగన్ ఎందుకు పాపులర్ చేస్తాడనే అనుమానాలు వస్తాయి. కానీ.. ఆలోచిస్తే అదే జరుగుతోంది. ఎలా అంటే.. రాష్ట్రంలో ఎక్కడ లైంగిక దాడి జరిగినా.. టీడీపీ కార్యకర్తలపై ఎవరు దాడిచేసినా నారా లోకేష్ వాలిపోతున్నాడు. వారిని పరామర్శిస్తున్నాడు. ధైర్యం చెబతున్నాడు.. అదే ఇపుడు జగన్ కు ఇబ్బందిగా మారింది. ఎక్కడ చూసినా లోకేష్ వార్తల్లో ఉంటుండటంతో చెక్ పెట్టాలని జగన్ పోలీసులకు అనధికారికంగా ఆదేశించాడు. దీంతో వారు.. లోకేష్ ఎక్కడకు వెళ్లాలన్నా అడ్డు చెబుతున్నారు. పర్మిషన్ లేదని అడుగు ముందుకు వేయనివ్వడం లేదు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యల వల్ల లోకేష్ హీరో అయిపోతున్నాడు.. ప్రభుత్వం, పోలీసులు తనను అడ్డుకుంటున్నాయని మీడియా మైకుల ముందు గట్టిగా చెబుతున్నాడు. ఆ వార్తలు జనాల్లోకి వెళుతున్నాయి. ఇక టీడీపీ సోషల్ మీడియా వాటిని వైరల్ చేస్తోంది. చంద్రబాబు డైరెక్షన్ లో లోకేష్ పార్టీ కోసం పనిచేస్తుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం ఆయనను హైలైట్ చేస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

గతంలో చంద్రబాబు కూడా ఇదే తప్పు చేశాడు..

గతాన్ని ఓ సారి గుర్తు తెచ్చుకుంటే.. చంద్రబాబు సీఎం.. జగన్ ప్రతిపక్ష నాయకుడు.. వైజాగ్ వెళ్లేందుకు జగన్ ప్రయత్నించాడు.. అంతే.. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు పోలీసులకు ఆదేశాలివ్వడంతో ఆయనకు పర్మిషన్ లభించలేదు. దీంతో ఎయిర్ పోర్టులోనే నిరసన వ్యక్తం చేసిన సంఘటన ఇంకా గుర్తుంది. ఆ సంఘటనతో జగన్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఇపుడు ఇదే సీన్ జరుగుతోంది. అయితే వ్యక్తులు మారారు అంతే.. ఇపుడు జగన్ సీఎం.. చంద్రబాబు ప్రతిపక్ష నేత. ఒక్కోసారి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్ష నేతలను హైలైట్ చేస్తాయి.