ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది. ఈ రెండేళ్లలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరికెన్ని సీట్లు వస్తాయి ? గెలుపు ఎవరిది ? అన్న అంశాలపై ప్రముఖ మీడియా ఛానెల్ నిర్వహించిన సర్వేలో ఏపీ ప్రజలు మరోసారి అధికార టీడీపీకే పట్టం కడతారని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని స్పష్టమైంది.
ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల టైం ఉంది ? ఇక ఆ సంస్థ చేసిన సర్వే ఫలితాలు అప్పటి ఎన్నికల్లో ఎంత వరకు ప్రతిబింబిస్తాయో తెలియదు గాని ? గత ఎన్నికలకు ఇప్పటకీ పోల్చి చూసుకుంటే బాబు క్రేజ్‌తో పాటు టీడీపీ ఓటు బ్యాంకు సైతం గణనీయంగా పెరిగినట్టు చెప్పింది. విపక్ష వైకాపా చాలా బలహీనపడింది.
ఎవరికి ఎన్ని ఓట్లు…సీట్లు:
ఈ సర్వేలో టీడీపీ బీజేపీ కూటమికి 46.53 శాతం ఓట్లతో ఏకంగా 120 స్థానాలు దక్కించుకుంటుందని తేలింది. అయితే టీడీపీ బీజేపీని కాదని ఒంటరిగా పోటీ చేస్తే ఆ సంఖ్య ఏకంగా 140 ఉంటుందట. టీడీపీ+బీజేపీ కలిసి పోటీ చేస్తే వైకాపాకు 50 సీట్లు వస్తే, అదే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వైకాపాకు మరో 20 సీట్లు తగ్గి కేవలం 30 సీట్లకే పరిమితమవుతుందని తేలింది. ఈ లెక్కన టీడీపీకి బీజేపీతో కలిసి పోటీ చేయడం కంటే ఒంటరిగా పోటీ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని సర్వే చెప్పింది. ఇక ఏపీలో నాశనం అయిన కాంగ్రెస్ కి 6.1 శాతం ఓట్లు, కమ్యూనిస్టులకు 2.9 శాతం ఓట్లు దక్కుతాయని… పవన్ జనసేనకు కేవలం 3.71శా తం ఓట్లు రానున్నాయని సర్వే స్పష్టం చేసింది.
టీడీపీ + బీజేపీ కూటమి గెలుచుకునే స్థానాలు :
1.టెక్కలి, 2.సాలూరు, 3.విశాఖ ఉత్తరం, 4. కాకినాడ, 5.ముమ్మిడివరం,6.ఉంగుటూరు, 7. కైకలూరు, 8. నందిగామ, 9. గుంటూరు వెస్ట్, 10. దర్శి, 11. కోడుమూరు, 12. అనంతపురం అర్బన్, 13. తిరుపతి తదితర స్థానాలను టీడీపీ, బీజేపీ కూటమి గెలుచుకుంటుంది.
వైకాపా గెలుచుకునే స్థానాలు :
1.రంపచోడవరం, 2. పాయకరావుపేట, 3. కర్నూలు, 4. పీలేరు, 5. పూతలపట్టు, 6. మైదుకూరు, 7. ఉదయగిరి స్థానాలు గెలుచుకుంటుంది.
టీడీపీ బీజేపీతో పొత్తు లేకుండా పోటీ చేస్తే….
పైన చెప్పిన 13 స్థానాలతో పాటు వైకాపా గెలుచుకునే పాయకరావుపేట, రంపచోడవరం, ఉదయగిరి, కర్నూలు స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకోనుంది.
బీజేపీతో విడిపోతే టీడీపీకి ఎందుకు లాభం…
బీజేపీతో విడిపోతే, ముస్లిం, మైనారిటీ వర్గాల ఓట్లు టీడీపీకి గంపగుత్తగా పడతాయని దాని వల్ల టీడీపీ బలం మరింత పెరుగుతుందని ఈ సర్వే చెప్పింది. ఇక మోడీ సైతం ఏపీకి ఏం చేయకపోవడంతో బీజేపీని ఏపీ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని ఈ సర్వే చెపుతోంది. అయితే దీనిపై టీడీపీ నేతలు ఫుల్ ఖుషీ ఫీలవుతున్నారు.
సర్వే వాస్తవాలకు దూరంగా ఉందని, తమతో కటీఫ్ చెబితే, టీడీపీకి అడ్రస్ ఉండదని బీజేపీ నేతలు చెపుతున్నారు. వైకాపా నేతలు మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన చంద్రబాబుకు మరోసారి ఓట్లేసే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని ఈ సర్వేపై మండిపడుతున్నారు.