ప‌వ‌న్ బాట‌లో జ‌గ‌న్‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్లు ఉండ‌గానే  ప్ర‌స్తుతం ఏపీలో బ‌హిరంగ స‌భ‌ల రాజ‌కీయాల వేడి మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి దీనికి తెర‌దీసింది మాత్రం.. ఇంకా రాజ‌కీయాల్లో పార్ట్ టైం పాత్ర‌ను మాత్ర‌మే పోషిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే చెప్పాలి.  రాజ‌కీయాల‌పై త‌న దిశ ద‌శ ఎలా ఉండ‌బోతున్నాయో ప్ర‌జ‌ల‌కు స‌వివ‌రంగా చెప్పేందుకంటూ ఆయ‌న తిరుప‌తిలో తొలిసారిగా బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. ఆ త‌రువాత కేంద్రం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ కాకినాడ‌లో మ‌రో స‌భ నిర్వ‌హించారు. ఈ రెండు స‌భ‌లు భారీగానే విజ‌య‌వంత‌మ‌య్యాయి.

ఇక 2019లో సీఎం పీఠంపై క‌న్నేసి.. టీడీపీ ప్రభుత్వంపై అలుపెరుగ‌ని పోరాటం సాగిస్తున్న వైఎస్ జ‌గ‌న్‌లో..ఈ ప‌రిణామాలు స‌హ‌జంగానే చురుకు పుట్టించాయి. ఎందుకంటే త‌నకున్న‌ప్ర‌జాకర్ష‌ణ‌తోపాటు స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూ ప‌వ‌న్ నెమ్మ‌ది నెమ్మ‌దిగా జ‌నంలోకి చొచ్చుకుపోతే త‌న‌కు చివ‌రకు మిగిలేదేమిటో ఊహించ‌లేనంత అమాయ‌కుడు కాదు వైసీపీ అధినేత‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోవాలంటే టీడీపీ సంగ‌తి అలా ఉంచి ముందు ప‌వ‌న్ గండాన్నిదాటాల్సి ఉంటుంద‌ని జ‌గ‌న్ ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యానికొచ్చిన‌ట్టు తెలుస్తోంది.

అందుకే టీడీపీకి సిస‌లైన‌ ప్ర‌త్యామ్నాయం తానేన‌ని నిరూపించుకునేందుకు త‌న పోరాటాన్నిమ‌రింత ఉధృతం చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ జ‌గ‌న్ అందుకు భారీ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికను సైతం సిద్ధం చేసుకున్నార‌ట‌.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని త‌న పార్టీకి ఓట్ల వ‌ర్షంగా మార్చుకోవడానికి మంచి అవ‌కాశం ఉందన్న న‌మ్మ‌కాన్నిపార్టీ క్యాడ‌ర్‌లో నింపేందుకు కూడా  విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో   రానున్న రోజుల్లో ఏపీ వ్యాప్తంగా ‘‘జై ఆంధ్రప్రదేశ్’’ పేరుతో ఐదు భారీ బహిరంగ సభల్ని నిర్వహించాలని వైసీపీ అధినేత  డిసైడ్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఐదు భారీ సభలు ఎక్కడ నిర్వహించ‌నున్నార‌న్న‌ అంశాన్ని మాత్రం ఆ జ‌గ‌న్ పార్టీ ఇంకా బ‌య‌ట‌పెట్ట‌లేదు.అయితే మొదటిసభను మాత్రం  విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు.  టీడీపీ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌ట్ట‌డం, ఏపీకి ప్రత్యేక హోదా రాకుంటే వ‌చ్చే స‌మ‌స్య‌ల‌పై  ప్రజలకు అర్థమయ్యేలా చెప్ప‌డం, త‌ద్వారా ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్‌ను ర‌గిలించి, దాన్ని వ‌చ్చే ఎన్నిక‌ల‌దాకా స‌జీవంగా ఉండేలా ప్ర‌యత్నించేందుకు ఈ బ‌హిరంగ స‌భ‌ల‌ను వినియోగించుకోవాల‌న్న‌ది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్ర‌జ‌ల్లో ఉన్న‌ ఇమేజ్ ను గ‌ట్టిగా దెబ్బ‌తీసేందుకు ‘‘జై ఆంధ్రప్రదేశ్’’ స‌భ‌ల కాన్సెప్ట్  త‌న‌కు ఉప‌క‌రిస్తుంద‌ని న‌మ్ముతున్న వైసీపీ అధినేత ఈ అంశంలో ఏమేర‌కు విజ‌య‌వంతమవుతారో చూడాల్సిఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్ర‌జ‌ల్లో ఉన్న‌ ఇమేజ్ ను గ‌ట్టిగా దెబ్బ‌తీసేందుకు ‘‘జై ఆంధ్రప్రదేశ్’’ స‌భ‌ల కాన్సెప్ట్  త‌న‌కు ఉప‌క‌రిస్తుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్న వైసీపీ అధినేత ఈ అంశంలో ఏమేర‌కు విజ‌య‌వంతమవుతార‌న్న‌దానిమీదే ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంద‌ని చెప్పాలి.